జనసేనాని కోరుకున్న శాఖలకు బాబు రెఢీ!
ప్రమాణస్వీకారం పూర్తైంది. మంత్రి పదవులు ఎవరికి దక్కాయో క్లారిటీ వచ్చేసింది.
By: Tupaki Desk | 13 Jun 2024 5:28 AM GMTప్రమాణస్వీకారం పూర్తైంది. మంత్రి పదవులు ఎవరికి దక్కాయో క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లటం తెలిసిందే. ఈ రోజు (గురువారం) ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని చేసుకోనున్నారు. అనంతరం మంత్రులకు కేటాయించే శాఖల్ని వెల్లడించనున్నట్లు చెబుతున్నారు.
కూటమిలో భాగంగా సంచలన విజయానికి కారణమైన జనసేనకు మూడు మంత్రిపదవుల్ని కేటాయించిన సంగతి తెలిసిందే. ఇంతకూ జనసేనకు చంద్రబాబు ఏయే శాఖల్ని కేటాయిస్తారు? పవన్ కు దక్కే మంత్రిత్వ శాఖలు ఏమిటనన దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆయన కోరుకున్న శాఖల్ని ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలతో పాటు.. ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు వీలైన శాఖలు ఇవ్వాలన్న మాట పవన్ నుంచి రావటంతో చంద్రబాబు అందుకు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. దీంతో.. కీలకమైన పంచాయితీరాజ్.. గ్రామీణాభివ్రద్ధి.. అటవీ.. పర్యావరణం శాఖల్ని ఆయనకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. జనసేన తరఫున మంత్రిత్వ శాఖల్ని సొంతం చేసుకున్న మరో ఇద్దరికి ప్రాధాన్యం ఉన్న శాఖల్నే కేటాయిస్తున్నారు.
జనసేనలో పవన్ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరించే నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేనకు చెందిన మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకం.. సినిమాటోగ్రఫీ శాఖను కేటాయిస్తారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పాలనలో ప్రాధాన్యం ఉన్న శాఖల్ని జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చేశారని తెలుస్తోంది. ఇక.. నారా లోకేశ్ కు సైతం ప్రాధాన్యం ఉన్న శాఖల్ని కట్టబెట్టనున్నట్లుగా చెబుతున్నారు.