అక్కడ మోడీ...ఇక్కడ బాబు... అంతేనా...!?
చంద్రబాబు విదేశాల్లో ఉన్నారు. ఆయన ఏ దేశం వెళ్లారు అన్న దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
By: Tupaki Desk | 29 May 2024 3:38 AM GMTచంద్రబాబు విదేశాల్లో ఉన్నారు. ఆయన ఏ దేశం వెళ్లారు అన్న దాని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరో వైపు చూస్తే చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఏపీ సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కంబోడియాకు మానవ అక్రమంగా మానవ రవాణా విశాఖ నుంచి సాగుతోందని వార్తలు వస్తున్న నేపధ్యంలో దాని మీద ఆయన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే ఏపీలో సోంవరం జరిగిన వరస రోడ్డు ప్రమాదాల మీద సంతాపం తెలియచేశారు. బాధితులకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా చేసిన ఒక ట్వీట్ ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారింది.
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు అని సర్వేల మీద సర్వేలు చేసినా ఎటూ ఫలితం తేలడం లేదు. ఎవరికి వారే తమదే గెలుపు అని అంటున్నారు. వైసీపీ అయితే ముహూర్తాల దాకా వెళ్ళింది. టీడీపీ క్యాడర్ లో అదే జోష్. అయితే మొదటిసారిగా చంద్రబాబు అదే ధీమాతో చేసిన ఒక ట్వీట్ మాత్రం బాగా వైరల్ అవుతోంది.
నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం పనిచేస్తాం అంటూ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్ పైన చంద్రబాబు ఆ వెంటనే స్పందించారు.
"నిజంగా ఎన్టీఆర్ గారు తెర మీద, తెర వెలుపల ఓ లెజెండ్. ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుంది, మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారూ!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
దీనిని బట్టి ఎవరు అర్ధం చేసుకుంటే వారికి అంత విషయం అన్నట్లుగా ఉంది ట్వీట్ అంటున్నారు. ఈ ట్వీట్ లో కలసి పనిచేద్దాం మోడీ గారూ అని బాబు అనడంలోనే అసలైన మ్యాటర్ ఉంది అని అంటున్నారు. అక్కడ కేంద్రంలో మోడీ ప్రధానిగా ఏపీలో చంద్రబాబు సీఎం గా 2024 ఎన్నికలో గెలుస్తారు అన్నది దీని అర్ధం. ఆ మీదట కలసి పని చేద్దామని బాబు అనడమూ అందులో భాగమే అని తాత్పర్యం చెబుతున్నారు.
అంటే చంద్రబాబు అన్ని రకాలైన సర్వేలు నివేదికలు చూసిన మీదట పూర్తి ధీమాతో ఈ ట్వీట్ చేశారు అని అంటున్నారు. కర్నాటక తెలంగాణాలలో కాంగ్రెస్ విజయం వెనక ఉన్న ఒక వ్యూహకర్త ఏపీలో పోస్ట్ పోల్ సర్వేని చేసి పూర్తి నివేదికను బాబుని ఇచ్చారని అందులో టీడీపీ కూటమి గెలిచి తీరుతుందని ఉందని అంటున్నారు. దాంతో పూర్తి నమ్మకంతో బాబు అక్కడ మోడీ ఇక్కడ మనం అంటున్నారు అని చెబుతున్నారు. సో జూన్ 4న ఫలితాలలో అదే జరుగుతుంది అని టీడీపీ వర్గాలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు అంటున్నారు.