చంద్రబాబు మౌనం వెనుక.. తుఫాను సంకేతమేనా?
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ఈ నెల 13నే ముగిసింది. అంటే.. దాదాపు 15 రోజులు అయిపోయింది.
By: Tupaki Desk | 28 May 2024 5:30 PM GMTరాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ఈ నెల 13నే ముగిసింది. అంటే.. దాదాపు 15 రోజులు అయిపోయింది. కానీ, ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కసారి కూడా.. తాము గెలుస్తున్నామని కానీ.. తమకు ఇన్ని సీట్లు వస్తున్నాయని కానీ.. ఎక్కడా కనీసం ప్రకటన చేయలేదు. క్షేత్రస్థాయిలో నాయకులు కూడా.. తర్జన భర్జన పడుతున్నారు. కొందరు పైకి చెబుతున్నా.. మరికొందరు చెప్పేందుకు కూడా జంకుతున్నారు. టీవీల చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు కూడా.. రోజు రోజుకు ఫిగర్ మార్చేస్తున్నారు.
మరోవైపు.. వైసీపీ నుంచి స్పష్టమైన ప్రకటనలు వస్తున్నాయి. సీఎం జగన్ తాను లండన్‌కు వెళ్తూ.. రాష్ట్రంతో తామే వస్తున్నా మన్నారు. అంతేకాదు.. దేశం నివ్వెరపోయేలా ఫలితం వస్తుందని చెప్పారు. 151 సీట్ల పైమాటే తప్ప.. కిందికి తగ్గే పరిస్థితి కూడా లేదన్నారు. ఇక, దీనిని అందిపుచ్చుకున్న ఇతర నాయకులు కూడా.. జగన్ వాదననే వినిపించారు. ఒకరిద్దరు మాత్రం 130-125 మధ్య వస్తాయని చెబుతున్నారు. మొత్తంగా ఏదో ఒక అంకె నైతే చెబుతున్నారు.కానీ, ఈ పరిస్థితి మనకు టీడీపీలో కనిపించడం లేదు.
చంద్రబాబు వంటి సీనియర్ మోస్ట్ నాయకుడు కానీ.. పవన్ కానీ.. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కానీ.. ఎక్కడా.. తమ పెరఫా ర్మెన్స్‌పై పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. నిజానికి దేశంలో ఆరు దశలో పోలింగ్ ముగిసిన తర్వాత.. బీజేపీ పెద్దలు కేంద్రంలో తాము అధికారంలోకి వస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. తాము ఏపీలోకూడా అధికారంలోకి (కూటమి) వస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉత్తరాది నాయకులే ఇంత ధైర్యంగా చెబుతున్నప్పుడు.. ఏపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ప్రశ్న.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే..ఆయన మౌనానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. 2019లో ఆయన చెప్పిన సమాచారం. అప్పట్లో రెండు దశల్లో ఏపీలో పోలింగ్ జరిగింది. రెండు దశల పోలింగ్ అనంతరం.. చంద్రబాబు వెంటనే మీడియా ముందుకు వచ్చారు. అప్పట్లో ఆయన సీఎం. ఇంకేముంది.. మేం గెలుస్తున్నామని.. మహిళలు.. క్యూలైన్లలో అర్ధరాత్రి వరకు నిలబడి ఓటేశారని.. ఇది తమకు పాజిటివ్ అని చెప్పారు.కానీ, పరాజయం పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆ కారణంగానే.. ఆయన మౌనంగా ఉన్నారని టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు.. సీఎం జగన్ చెప్పినట్టు జూన్ 4న వచ్చే ఫలితంతో దేశం మొత్తం ఆశ్చర్య పోతుందని.. చంద్రబాబు కూడా నమ్ముతు న్నారు. కూటమి విజయంతో దేశమే ఏపీవైపు చూస్తుందని అనుకుంటున్నారు. అందుకే తినబోతూ రుచి చూడడం ఎందుకని ఆయన భావిస్తున్నారని.. అందుకే తుఫాను ముందటి ప్రశాంతతను ఆయన పాటిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? ఎవరు గెలుస్తారు? అనేది మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.