Begin typing your search above and press return to search.

ఉద్యోగులతో చంద్రబాబు తీరు ఇదేనా?

చంద్రబాబును సీఈవో టైప్‌ సీఎం అని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. ఒక కంపెనీ సీఈవోలాగా ఆయన వ్యవహరిస్తుంటారని అనేవారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 8:30 AM GMT
ఉద్యోగులతో చంద్రబాబు తీరు ఇదేనా?
X

చంద్రబాబును సీఈవో టైప్‌ సీఎం అని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. ఒక కంపెనీ సీఈవోలాగా ఆయన వ్యవహరిస్తుంటారని అనేవారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆకస్మిక తనిఖీలు పేరుతో ఆయన ఉద్యోగులను గడగడలాడించేవారు. బహిరంగ సభలు, సమావేశాల్లోనూ ఉద్యోగులను పిలిచి సంబంధిత శాఖల లెక్కలు అడగడం, పలు ప్రశ్నలు సంధించడం చేసేవారు. ఈ క్రమంలో ఉద్యోగులు వణికిపోయేవారు. కొంతమంది అయితే కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరిగ్గా పనిచేయడం లేదని అక్కడికక్కడే కొందరు ఉద్యోగులను సీఎంగా చంద్రబాబు సస్పెండ్‌ చేసిన ఉదంతాలు, మందలించిన ఘటనలు కూడా ఉన్నాయి.

ఇక 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగులు తమ సమస్యలను వివరించడానికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు వారితో కఠినంగా వ్యవహరించేవారనే విమర్శలు ఉన్నాయి. నిరసనలు, ధర్నాలు చేసినా పట్టించుకునేవారు కాదని, వాటిని అణచివేసేవారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలని.. సరిగ్గా సమయానికి రావాలని.. నిర్దేశిత పనివేలళ్లో అంకితభావంతో పనిచేయాలని చంద్రబాబు వారికి ఉద్భోదించేవారు. పనివిషయంలో ఆయన రాజీపడేవారు కాదు. ఈ విషయంలో ఒక కంపెనీ సీఈవో అన్నట్టే చంద్రబాబు వ్యవహరించేవారని అంటారు. 2019లో చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ అంశం కూడా కార ణమైందని అంటారు. ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తితోనే చంద్రబాబు ఓడిపోయారనేవారూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసారి ఉద్యోగులతో సామరస్యంగా ఉండనున్నారని తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీలు, పని ఒత్తిడి, క్రమశిక్షణ పేరుతో వారిని వేధించడం వంటివి ఉండవని అంటున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇప్పటికే చంద్రబాబు చెప్పారు.

ఇటీవల ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. వారికి ఇవ్వాల్సిన ఎరియర్స్, పెండింగ్‌ బకాయిలు, వైద్య బిల్లుల చెల్లింపులు, గ్రాట్యుటీ తదితరాలను ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు.

ముఖ్యంగా ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసనలు, ధర్నాలు నిర్వహించినా వాటిపైనా ఉదారంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరి హక్కులను ప్రభుత్వం హరించబోదని చంద్రబాబు ఇప్పటికే ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణతో ఉంటూ సకాలంలో పనులు పూర్తి చేస్తే చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారని అంటున్నారు. పని ఒత్తిడి లేకుండా చేయడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా ఉద్యోగులను హెచ్చరించడం, వారు ఆలస్యంగా వచ్చారని జీతాల్లో కోతలు విధించడం వంటివి ఉండవని అంటున్నారు. ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు మంచి సంస్కరణలు తీసుకువస్తారని చెబుతున్నారు.