అధికారమే లక్ష్యంగా చంద్రబాబు యాగాలు... ఇవే వివరాలు!
అవును... ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఇవాళ్టి నుంచి ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు.
By: Tupaki Desk | 22 Dec 2023 5:51 AM GMTసాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్నప్పుడు, రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నప్పుడూ యాగాలు చేయడం అనగానే కేసీఆర్ పేరే గుర్తుకువస్తుందని అంటారు. ఇటీవల కాలంలో వారాహి యాత్ర ప్రారంభించే సమయంలో పవన్ కూడా యాగాలు చేశారు! ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు.
అవును... ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఇవాళ్టి నుంచి ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. ఉండవల్లిలోని నివాసంలో ఈ ప్రత్యేక యాగాలు నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాగాల్లో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఆసక్తికరంగా మారింది.
ఇందులో భాగంగా... శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. ఈ యాగాల్లో ప్రధానంగా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నివాసంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు తన అపాయింట్ మెంట్లను చంద్రబాబు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు బెయిల్ పై బయటికి వచ్చాక వరుసగా ఆలయాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తిరుమల వెంకన్న, బెజవాడ కనకదుర్గమ్మ, గుణదల మేరీమాత ఆలయాలను దర్శించుకున్నారు. ఇదే క్రమంలో ఇటీవల తమిళనాడు వెళ్లి అక్కడ ఆలయాలను కూడా దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించబోతున్నారు.
ఈ మధ్యే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో ఆయన త్వరగా విడుదలవ్వాలని పలువురు టీడీపీ నేతలు యాగాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇందులో భాగంగా బెంగళూరులో మహా నవచండీయాగాన్ని నిర్వహించగా.. కలిగిరిలో శత చండీ రుద్రయాగం నిర్వహించారు.
కాగా... రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పటికే సీట్ల సర్ధుబాటు విషయంలో కూడా ఒక కొలిక్కి వచ్చారని తెలుస్తుంది. మరోపక్క బీజేపీ కలిసివచ్చే అవకాశాలపై ఎదురుచూస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అలాకానిపక్షంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లతో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశాలనూ కొట్టిపారేయలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు మూడురోజులపాటు సతీసమేతంగా శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు!