Begin typing your search above and press return to search.

క్రిష్ణాలో అమరావతి నినాదం...ఉత్తరాంధ్రాలో బాబు ఏం చెబుతారో...!?

చంద్రబాబు కదలిరా పేరిట ఏపీవ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు సమావేళాలో భాగంగా క్రిష్ణా జిల్లా తిరువూరులో జరిగిన సభలో అమరావతి రాజధాని మీద గట్టిగా నినదించారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 10:30 AM GMT
క్రిష్ణాలో అమరావతి నినాదం...ఉత్తరాంధ్రాలో బాబు ఏం చెబుతారో...!?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ చతురుడు. ఆయన రాజకీయం ఏ ఏటికి ఆ ఏడు ఇంకా రాటుతేలుతోంది. అమరావతి రాజధాని విషయంలో టీడీపీ స్టాండ్ అందరికీ తెలిసిందే. అసలు అమరావతి రాజధానిని ఎంపిక చేసింది అక్కడ భూములను వేల ఎకరాలలో సేకరించి పెట్టింది టీడీపీయే.

ఒక విధంగా చెప్పాలంటే అమరావతి టీడీపీ డ్రీం కాపిటల్. అయితే జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకుని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి అంటూ ముందుకు వచ్చాక మొదట్లో అమరావతికి ఓపెన్ గా మద్దతు ఇచ్చిన టీడీపీ ఆ తరువాత తెర వెనక ఉంటూ రైతు ఉద్యమాలకు మద్దతుగా నిలిచింది

ఇక అమరావతి విషయంలో న్యాయ స్థానాలలో ఉంది. హైకోర్టు అమారావతి రాజధాని అన్నది తేలినా దాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చాలెంజ్ చేసింది. దాంతో ఇపుడు ఆ కేసు అక్కడ ఉంది. అయితే తదుపరి వాయిదా ఏప్రిల్ లో ఉంది. అప్పటికి ఏపీలో ఎన్నికలు కూడా ముగుస్తాయని అంటున్నారు.

దాంతో ఇపుడు టీడీపీ కూడా అమరావతి మీద తన స్టాండ్ మళ్లీ ఓపెన్ చేసి పెట్టుకుంటోంది అని అంటున్నారు. చంద్రబాబు కదలిరా పేరిట ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు సమావేళాలో భాగంగా క్రిష్ణా జిల్లా తిరువూరులో జరిగిన సభలో అమరావతి రాజధాని మీద గట్టిగా నినదించారు.

హైదరాబాద్ తో సరిపోల్చుతూ అమరావతి గురించి ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ గత అయిదేళ్ళ కాలంలో కళకళలాడుతూంటే అమరావతి మాత్రం వెలవెలబోతోంది అని ఆయన అంటున్నారు. అమరావతి రాజధానిని జగన్ సర్వనాశనం చేశారు అని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేసింది అని బాబు ఫైర్ అయ్యారు.

మూడు రాజధానులు సీఎం అయ్యాక కొత్త స్టాండ్ తీసుకున్నారు అని బాబు నిందించారు. ఇదే జగన్ అసెంబ్లీలో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చారా లేదా అని ఆయన క్రిష్ణా జిల్లాలో ప్రజలనే ప్రశ్నించారు. వైసీపీ ఏలుబడిలో రాష్ట్రం దారుణంగా దెబ్బ తిందని ఆయన విమర్శించారు.

ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తే ఏపీకి అమరావతికి కొత్త వెలుగులు వస్తాయని ఆయన చెప్పాల్సింది చెప్పేశారు. క్రిష్ణా జిల్లా నడిబొడ్డున అమరావతి రాజధాని నినాదాన్ని అందుకున్న చంద్రబాబు ఉత్తరాంధ్రాలో ఏమి చెబుతారు అన్న చర్చను పెడుతున్నారు. ఉత్తరాంధ్రా ముఖద్వారం అయిన విశాఖను పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రతిపాదించింది.

దాంతో అమరావతి మన రాజధాని అంటే అక్కడ ఉత్తరాంధ్రా సెంటిమెంట్ ని వైసీపీ లేవనెత్తుతుంది. మామూలుగా అయితే అందరూ మౌనంగానే ఉంటారు కానీ రాజధాని రాదు లేదు అంటే అది సెంటిమెంట్ అవుతోంది. బాబు నోటి వెంట అదే రావలని వైసీపీ కోరుకుంటోంది. మరి క్రిష్ణా జిల్లాలో బిగ్ సౌండ్ చేసిన బాబు ఉత్తరాంధ్రాలో రాజధాని మీద టీడీపీ స్టాండ్ ఏంటో ప్రకటిస్తారా అన్నదే ఇపుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.