బాబు నోట పదే పదే అదే మాట.. తమ్ముళ్ల పరిస్థితేంటి..?
టీడీపీ అధినేత చంద్రబాబు నోట పదే పదే ఒక మాట చెబుతున్నారు. అందరూ కలిసి పనిచేయాలని.. అందరూ కలిసి ఉమ్మడిగా ఉండాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచిస్తున్నారు.
By: Tupaki Desk | 11 Dec 2023 3:12 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు నోట పదే పదే ఒక మాట చెబుతున్నారు. అందరూ కలిసి పనిచేయాలని.. అందరూ కలిసి ఉమ్మడిగా ఉండాలని.. పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచిస్తున్నారు. అంతే కాదు, నాయకులు కీచులాడుకోవద్దని అంటున్నారు. ఈ మాట ఇప్పుడు చెప్పడం కాదు.. గత రెండేళ్లుగా ఇదే మాట చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. అక్కడ చంద్రబాబు నోటి నుంచి ఇదే మాట వస్తుండడం గమనార్హం.
తాజాగా బాపట్ల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మరోసారి ఇక్కడ నాయకులకు ఉమ్మడి పోరాటాలపై నే దిశానిర్దేశం చేశారు. అందరూ కలిసి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీని బలహీన పరచవద్దని.. ఎవరు ప్రజల్లో ఉంటున్నారో.. ఎవరు ఉండడం లేదో కూడా తమకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో జనసేనతో పొత్తుపైనా నాయకులకు దిశానిర్దేశం చేశారు.
జనసేన-టీడీపీ కలిసి ముందుకు సాగుతాయని.. ఈ విషయంలో ఎలాంటి తేడాలేదని, దీనిని విభేదించేం దుకు వీలు లేదని.. అందరూ అంగీకరించాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే.. ఎన్నికల కు రెండున్నర సంవత్సరాల ముందు, ఇప్పుడు నాలుగు మాసాల ముందు కూడా.. చంద్రబాబు ఇదే మాట చెప్పడం.. రాజకీయంగా పార్టీ పరిస్తితిపై చర్చను లేవనెత్తింది.
పార్టీలో ఐక్యత, నాయకుల ఉమ్మడి పోరాటాలు వంటివి ఇప్పటికీ ఒక దిశానిర్దేశం లేకుండానే జరుగుతు న్నాయి. కీలక నాయకులు వస్తే మాత్రం ఉమ్మడిగా ఉన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు తప్ప.. తర్వాత మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి రెండేళ్ల కిందట ఉన్న పరిస్థితి ఇంకా అలానే కొనసాగితే.. చంద్రబాబు ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయనేది చర్చ. దీనివల్ల ఆయనకు నష్టం లేకపోయినా.. క్షేత్రస్థాయిలో నాయకులు నష్టపోవడం ఖాయమని అంటున్నారు.