వైసీపీ విన్నపాన్ని ఓకే చేసిన ఎన్నికల కమిషన్
ఈ అంశంపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ అధికార వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున పోలింగ్ నిర్వహించాలని రిక్వెస్టు చేశారు.
By: Tupaki Desk | 17 March 2024 5:34 AM GMTతెర మీదకు తీసుకొచ్చే అంశంలో సహేతుకమైన అంశాలు ఉన్నప్పుడు.. వాటికి సానుకూలత ఉంటుంది. తాజాగా అలాంటి అంశమే కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో స్పష్టమైందని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల వేళ.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేకంగా ఏపీకి చెందిన ఓటర్లు పెద్ద ఎత్తున తెలంగాణలో ఉండటం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుంటే.. కొందరు ఓటర్లు రెండు చోట్ల ఓట్లు వేస్తున్న వైనం తెలిసిందే. ఎందుకంటే.. వీరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు ఉండటమే కారణం.
ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ద్రష్టికి తీసుకెళ్లింది ఏపీ అధికార వైసీపీ. 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికల పోలింగ్ జరటం తెలిసిందే. అప్పటి ఎన్నికల షెడ్యూల్ ను చూస్తే.. తొలుత తెలంగాణలో ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. ఆ తర్వాత ఏపీలో జరిగాయి. దీంతో.. తెలంగాణలో తమ ఓటుహక్కును వినియోగించుకున్న వారు.. ఆ తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ తమ ఓటు వేశారు.
ఈ అంశంపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ అధికార వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున పోలింగ్ నిర్వహించాలని రిక్వెస్టు చేశారు. దీని కారణంగా ఒక ఓటరు ఒకేచోట ఓటు వేసే వీలు ఉంటుందని..రెండు రాష్ట్రాల్లో ఓటు వేసే అవకాశానికి చెక్ పెట్టొచ్చని పేర్కొంది.
వైసీపీ తెర మీదకు తీసుకొచ్చిన ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. తాజాగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి పోలింగ్ నిర్వహించేలా షెడ్యూల్ ను రూపొందించారు. దీంతో.. వైసీపీ విన్నపాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.