ఈ సెలబ్రెటీల కుటుంబాల్లో విషాదం నింపిన ఓ.ఆర్.ఆర్.!
దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 23 Feb 2024 4:07 PM GMTదేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా నెత్తురోడుతున్న రోడ్ల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతుంటాయి. ఇదే సమయంలో ఈ ప్రమాదాల వల్ల ఎంతో మంది మృత్యుఒడికి చేరుకుంటుంటే.. మరికొంతమంది క్షతగాత్రులుగా మిగులుతుంటారు! అజాగ్రత్త, అతివేగం, మద్యంమత్తు, రోడ్లపై గుంతలు... కారణం ఏదైనా నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి!
ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై యువ ఎమ్మెల్యే మృత్యువాత పడ్డారు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో... ఈ అవుట్ రింగ్ రోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో ఓ.ఆర్.ఆర్. మీద ఎంతో మంది ప్రముఖులు, ప్రముఖుల పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారు ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం...!
2010లో కోట ఇంట తీవ్ర విషాదం!
సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్ (39) తన స్పోర్ట్స్ బైక్ పై ఓ.ఆర్.ఆర్. నుంచి శంషాబాద్ వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జూన్ 20, 2010న శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్ కు బయల్దేరిన ప్రసాద్ హఠాత్తుగా వచ్చిన డీసీఎంను ఢీకొట్టడంతో మృతి చెందారు.
2011లో అజారుద్దీన్ ఇంట తీరని శోకం!:
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్ (19) ఓ.ఆర్.ఆర్.పై మృతి చెందాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్ ల్లో పాల్గొన్న అయాజుద్దీన్... బైక్ పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2011 - సెప్టెంబర్ 17న మృతి చెందాడు.
అదే ఏడాది కోమటిరెడ్డి కొడుకు..!:
డిసెంబర్ 19, 2011 మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం, కొల్లూరు ఓ.ఆర్.ఆర్. వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డి కారు డివైడర్ కు ఢీకొట్టి నుజ్జు నుజ్జు అవ్వడంతో ఈ దారుణం సంభవించింది. ఈ సమయంలో అతడితోపాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే ఇద్దరు యువకులు కూడా మరణించారు.
2017లో రవితేజ సోదరుడు భరత్!:
శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ దగ్గర ఓ.ఆర్.ఆర్.పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీహీరో రవితేజ సోదరుడు, నటుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2017 జూన్ లో గచ్చిబౌలి వెళ్తుండగా ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత!:
తాజాగా ఓ.ఆర్.ఆర్.పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఇందులో భాగంగా... లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టడంతో లారీకి కారు ఇరుక్కుపోవడంతో సుమారు 100 మీటర్లు ముందుకు లాక్కునిపోయి.. రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.