బెట్టింగ్ యాప్స్ : చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న సెలబ్రెటీలు
కర్నూలుకు చెందిన రాము.. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో వీడియోలు చూసేవాడు.
By: Tupaki Desk | 17 March 2025 11:10 PM ISTడబ్బుల కోసం అర్రులు చాచారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. కట్ చేస్తే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ప్రభుత్వాలు మారాయి.. వారి ప్రాధాన్యాలు పెరిగాయి.. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ను కాసుల కక్కుర్తి కోసం వాడుకున్నారో వారందరిపై తాజాగా కేసుల నమోదయ్యాయి.. ‘డబ్బులు సంపాదించడం ఇంత సులభమా?’ అన్నట్లుగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలకు ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. బెట్టింగ్ యాప్స్ మాయలో ఎంతోమంది అమాయక ప్రజలను ముంచేస్తున్న పరిస్థితి నెలకొంది..
కర్నూలుకు చెందిన రాము.. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో వీడియోలు చూసేవాడు. ఒకరోజు తన అభిమాన నటుడు ఒక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ కనిపించాడు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం’ అంటూ ఆ నటుడు చెప్పిన మాటలు రామును ఆకర్షించాయి. మొదట్లో సరదాగా కొద్ది మొత్తంలో డబ్బులు పెట్టాడు. కొన్నిసార్లు గెలుపు రావడంతో అతడికి మరింత ఆశ పెరిగింది.
క్రమంగా రాము తనకున్న కొద్దిపాటి పొదుపునంతా బెట్టింగ్‌లో పెట్టడం మొదలుపెట్టాడు. గెలవడం కన్నా ఓడిపోవడమే ఎక్కువైంది. అప్పులు పెరిగిపోయాయి. కుటుంబ సభ్యులకు ఏం చెప్పాలో తెలియక తీవ్ర వేదనకు గురయ్యాడు. రాము ఒక్కడే కాదు.. ఇలా ఎంతోమంది యువకులు బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ రంగంలోకి దిగారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వల్ల సమాజం ఎంతగానో నష్టపోతోందని ఆయన ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ సామాజిక సమస్యపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
మొదటగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన హర్ష సాయి మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇది మిగతా సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లలో కలకలం రేపింది. గతంలో ఎంతో మంది టాలీవుడ్ చిన్న నటులు, సెలబ్రెటీలు ఎంతోమంది బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. హర్ష సాయి అరెస్ట్ కావడంతో వీరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
తమ పాత వీడియోలను సోషల్ మీడియా నుండి తొలగించడం మొదలుపెట్టారు. ‘గతంలో తెలియక ప్రమోట్ చేశాం. ఎవ్వరూ ఈ యాప్‌ల జోలికి వెళ్లొద్దు’ అంటూ క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేస్తున్నారు. నిజానికి పోలీసుల భయంతోనే వీరంతా ఇలా చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది.
సజ్జనార్ తీసుకున్న చర్యతో ఇప్పుడు చాలా మందిలో మార్పు కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సెలబ్రెటీలు కూడా డబ్బు కోసం కళ్లు మూసుకుని ప్రమోషన్లు చేయకూడదని గ్రహిస్తున్నారు.
ఇదొక మంచి పరిణామం. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా అరికట్టవచ్చు. అమాయక ప్రజల జీవితాలను కాపాడవచ్చు. డబ్బు సంపాదనే ధ్యేయంగా కాకుండా, బాధ్యతగా ప్రవర్తించే సెలబ్రెటీలను మనం ప్రోత్సహించాలి. అప్పుడే సమాజం సరైన మార్గంలో పయనిస్తుంది.