జమిలి బిల్లులపై కేంద్రం బ్యాక్.. అందుకేనా ఆలస్యం!
జమిలి ఎన్నికల బిల్లు మీద కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. సోమవారమే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్నిరకాల కసరత్తులు పూర్తిచేశారు.
By: Tupaki Desk | 15 Dec 2024 8:02 AM GMTవచ్చే ఎన్నికలను జమిలి పద్ధతిలోనే నిర్వహించాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం.. ఇప్పటికే సగానికి పైగా ప్రక్రియను పూర్తిచేసింది. ఇక లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టడమే తరువాయి అన్నట్లుగా మిగిలిపోయింది. అయితే.. సోమవారం బిల్లులు లోక్‌సభ ప్రవేశపెట్టనున్నట్లు ముందుగా ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేసినట్లుగా తెలుస్తోంది.
జమిలి ఎన్నికల బిల్లు మీద కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. సోమవారమే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్నిరకాల కసరత్తులు పూర్తిచేశారు. అటు పార్టీల వారీగా తమ సభ్యులకు త్రీ లైన్ విప్ సైతం జారీ చేశారు. ఇందుకోసం.. లోక్‌సభ బిజినెస్‌లో జమిలి బిల్లుతోపాటు మరో బిల్లు ఆమోదించేందుకు కేంద్రం పొందుపరిచింది. కానీ.. చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో కానీ.. లోక్‌సభ బిజినెస్‌లో ఆ రెండు బిల్లులను తొలగించింది. ఒక్కసారిగా కేంద్రం వెనక్కి తగ్గడంతో బిల్లుపై అనుమానాలు ప్రారంభం అయ్యాయి.
ఇప్పటికే జమిలి ఎన్నికల బిల్లుపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ప్రధాని మోడీ ప్రకటించారు. అందుకు.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడుతామంటూ కూడా ప్రచారం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ నెల 20తో ముగియనున్నాయి. అంటే.. వచ్చే శుక్రవారంతో సభలు వాయిదా పడనున్నాయి. ఈ టైములో బిల్లును ఆమోదింపజేయడం ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి కీలకంగా మారిందని చెప్పాలి. చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంపై పలు సందేహాలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందుకోసం జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఏటాదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తోంది. అలాగే.. వివిధ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం సైతం అంతా ఎన్నికల ప్రాసెస్‌లోనే ఉంటుంది. ఈ తరహా సమస్యల నుంచి బయటపడేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో బిల్లు ప్రవేశపెట్టడంపై వెనక్కి తగ్గడంపై పలురకాల చర్చలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల్లోనే సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఈ సమయంలో ప్రవేశపెట్టి తొరగా ఆమోదింపజేస్తారా..? లేదంటే అలాగే పెండింగులో పెడుతారా..? అనేది కూడా అర్థం కాకుండా ఉంది.