మార్చి 3న కేంద్ర కేబినెట్.. షెడ్యూల్ కు సరిగ్గా వారం.. మర్మమేమిటి
లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ కు సరిగ్గా వారం రోజుల ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది
By: Tupaki Desk | 21 Feb 2024 5:04 PM GMT2019 ఎన్నికలకు సంబంధించి ఆ ఏడాది మార్చి 10న షెడ్యూల్ వెలువడింది.. ఆపై నోటిఫికేషన్ వచ్చింది.. ఏప్రిల్ 10న తొలి దశ పోలింగ్ (ఏపీ అసెంబ్లీ, లోక్ సభ సీట్లు సహా దేశంలో కొన్ని సీట్లకు) జరిగింది. మే 23న దేశమంతటా ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి కూడా మార్చి రెండోవారంలో షెడ్యూల్ వెలువడడం ఖాయం అనే కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తమ ప్రయత్నాలు చేసోస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి సన్నద్ధతను పరిశీలిస్తోంది. కానీ, వచ్చే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కు కొద్దిగా ముందు జాతీయ స్థాయిలో కీలక పరిణామం ఏమైనా జరగనుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనంతటికీ ఓ కారణం ఉంది.
సరిగ్గా వారం ముంగిట వరాలుంటాయా?
లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ కు సరిగ్గా వారం రోజుల ముందు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మార్చి 3న .. అంటే సరిగ్గా పది రోజుల్లో ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్ లో కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఏం జరగనుందో? ఏమైనా వరాలిస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల వాతావరణంలో మంత్రివర్గం సమావేశం కావడం చాలా తక్కువ. కానీ, ఈసారి దానికి భిన్నంగా జరుగనుంది. దీంతోనే ప్రాధాన్యం ఏర్పడింది.
మార్చి 9 తర్వాత
మోదీ తొలిసారి ప్రధాని అయిన ఎన్నికలు 2014లో జరిగాయి. వాటిని తొమ్మిది విడతల్లో జరిపారు. అప్పుడు మార్చి 5న ప్రక్రియ మొదలై మే 16న ఫలితాలు వచ్చాయి. అయితే, 2019లో మార్చి 10న షెడ్యూల్ వచ్చింది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ సాగింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. గత షెడ్యూల్ వచ్చి అప్పటికి సరిగ్గా ఐదేళ్లు అవుతుంది. కాగా, ఈసారి లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం శాసనసభలకు మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. క్రితం సారి ఈ జాబితాలో లేనిది జమ్మూకశ్మీర్. 2019ల ఎన్నికల అనంతరం మూడు నెలలకు కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికిల్ 370ని రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్ ను కశ్మీర్, లద్దాఖ్ గా విభజించారు. అప్పటినుంచి కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంది. అక్కడి అసెంబ్లీకి లోక్ సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఏమైనా తీర్మానాలుంటాయా?
మార్చి 3న జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏమైనా ప్రత్యేక తీర్మానాలుంటాయా? అనేది చూడాలి. మోదీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని అంటున్న నేపథ్యమే ఈ ఊహాగానాలకు బలం ఇస్తోంది. మరోవైపు 370 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నందున మోదీ రెండో మంత్రివర్గ చివరి సమావేశం ద్వారా ఏం చెబుతారనేది ఆసక్తిగానూ మారింది. గత పదేళ్ల పాలన.. మరీ ముఖ్యంగా ఐదేళ్లుగా మోదీ పెద్దగా ప్రజాకర్షక విధానాలు ప్రకటించలేదు. వాటిని భర్తీ చేస్తూ దేశ ప్రజలకు ఏమైనా ఊరడింపులు ఇస్తారేమో చూడాలి.