Begin typing your search above and press return to search.

కేంద్రానికి కార్పొరేట్ ఆలోచ‌న‌లే.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే బాబూ!

దీంతో అప్పటివరకు వివిధ మొబైల్ కంపెనీలను అనుసరించిన వినియోగదారులు ఒక్కసారిగా జియో కి మారిపోయారు.

By:  Tupaki Desk   |   25 July 2024 10:30 AM GMT
కేంద్రానికి కార్పొరేట్ ఆలోచ‌న‌లే.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే బాబూ!
X

కార్పొరేట్ ఆలోచనల దిశగా మోడీ సర్కార్ పనిచేస్తోందా? కార్పొరేట్ లక్ష్యాల దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. సహజంగా కార్పొరేట్ కంపెనీలు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరిస్తాయి. ఉదాహరణకు ముఖేష్ అంబానీ వ్యాపారాన్ని చూస్తే 'జియో' ప్రారంభంలో అనేక ఉచిత పథకాలను ప్రవేశపెట్టింది. దీంతో అప్పటివరకు వివిధ మొబైల్ కంపెనీలను అనుసరించిన వినియోగదారులు ఒక్కసారిగా జియో కి మారిపోయారు. ఇది కార్పొరేట్ ఆలోచన.

తర్వాత జియో తన విశ్వరూపం చూపించింది. ఇటీవల ఒక్కసారి టారిఫ్‌ల‌ను పెంచేశారు. అప్పటికే జియోకు అలవాటు పడి ఉండడంతో, జియో లేకపోతే ఇక మనుగ‌డ‌ కూడా లేదనే స్థితికి వినియోగదారులు చేరిపోయిన ద‌రిమిలా ఎంత పెంచినా కట్టే పరిస్థితికి వచ్చేసారు. ఇది కార్పొరేట్ సంస్థలు అనుసరించే విధానం. కొందరు ఉచితాల‌ పేరుతో ఆకర్షిస్తారు. మరికొందరు కానుకల పేరుతో ఆకర్షిస్తారు. ఇది కార్పొరేట్ కంపెనీలు చేసే పని. అయితే ప్రభుత్వాలు కూడా ఈ మార్గంలోనే నడవడం ఎప్పుడూ లేదు.

ముందు తాయిలాలు ప్రకటించడం తర్వాత, ప్రజలను బాదేయ‌డం అనే సంస్కృతి 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ తొలిసారి మోడీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా కొన్ని కొన్ని రంగాల్లో కార్పొరేట్ ఆలోచనలను అవలంభిస్తోంది. ఉదాహరణకు `ఆదాయపు ప‌న్ను`(ఇన్‌కం ట్యాక్స్‌) విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీసింది. ఇప్పటివరకు పాత ఆదాయపు పన్ను విధానాల్లో దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉన్నారు. దీని ప్రకారం పన్ను ఆదాయంలో వారు కొన్ని మిన‌హాయింపుల‌ను పొందుతున్నారు.

తద్వారా పన్ను ఆదాయం నుంచి తమను తాము కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే 2021లో తీసుకువచ్చిన `నూతన పన్ను` విధానం ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సంకటంగా మారింది. ఉదాహరణకు ఏదైనా విరాళం ఇచ్చినా, ఎల్ఐసి కట్టుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ క‌ట్టుకున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కున్నా వీటన్నిటికీ పాత విధానంలో మినహాయింపులు ఉన్నాయి. అంటే ఒక రకంగా ఇది ఉద్యోగులకు చాలా మేలు చేస్తుంది. కానీ కొత్త పన్ను విధానానికి వచ్చేసరికి వీటిని తీసేశారు.

నూతన పన్ను విధానాలలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. దీంతో నూతన పన్ను విధానానికి ఉద్యోగులు ఆస‌క్తి చూపలేదు. ఇప్పటికీ ఈ పథకాన్ని తీసుకొచ్చి మూడు సంవత్సరాలు అయిపోయినా నూతన పన్ను విధానాన్ని అనుసరిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 75 శాతం మంది కొత్త పన్ను విధానంలోకి మారారని చెప్పినా వాస్తవానికి మారింది 33% మాత్రమే. అది కూడా బలవంతంగా మార్చినట్టుగానే రికార్డులు చెప్తున్నాయి. దీంతో నూతన పన్ను విధానంలోకి మారేవారికి ఇప్పుడు తాయిలాలు ప్రకటించారు.

ఇప్పటివరకూ ఉన్న స్టాండ‌ర్డ్‌ డిడక్షన్ 50 వేల రూపాయలు నుంచి 75 వేల రూపాయలు పెంచారు. ఇంతకుమించి నూతన పన్ను విధానాల్లో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎల్ఐసిలు, కొత్తగా ఇల్లుకున్నా కూడా పన్ను మినహాయింపులు లేవు. అందుకే ఇప్పుడు ఆదాయపు ప‌న్ను పరిమితిని కొత్త పన్ను విధానంలో 7 లక్షల రూపాయలకు పెంచారు. ఇది కార్పొరేట్ ఆలోచ‌న‌. ఇప్పుడు 7 ల‌క్ష‌ల‌కు పెంచారని దాన్ని అనుసరిస్తే వచ్చే సంవత్సరం దీనిని త‌గ్గించే అవ‌కాశం ఉంది.

మరో విషయాన్ని తీసుకుంటే.. రైతుల మద్దతు ధర. ఈ విషయంలో ప్రభుత్వం పంజాబ్, హర్యానా చండీగఢ్ ఇలా ఉత్తరాది రాష్ట్రాల రైతులు మద్దతు ధరల పెంపుతో పాటు మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. మ‌ద్ద‌తు ధ‌ర‌లు పెంచుతున్న ప్ర‌బుత్వం.. మ‌రో చేత్తో కార్పొరేట్ త‌ర‌హా ఆలోచ‌న చేస్తోంది. 5 రూపాయ‌ల‌ పెన్ను ఉచితంగా ఇచ్చి.. 100 రూపాయ‌ల స‌బ్బును కొనేలా చేస్తోంది. వ్యవసాయ సంబంధమైన పరికరాలు. ఎరువులు, విత్తనాల ధరలను పెంచుతోంది.

ఉదాహరణకు ఉచితంగా ఇచ్చే ఏ వస్తువులు కూడా కార్పొరేట్ సంస్థ ఉచితంగా ఇవ్వదు. ఆధ‌ర‌ను కూడా కొనుగోలు చేసే వస్తువులోనే కలిపేస్తుంది. ఇది కూడా అంతే. ఒకవైపు మద్దతు ధర పెంచుతూనే.. మరోవైపు ఎరువులు ఇతర ముడిపదార్థాల విషయంలో ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇలా ప్రభుత్వం కార్పొరేట్ తరహా ఆలోచనతో ముందుకు సాగడం అనేది దేశంలో చాలా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఈ విష‌యాల‌ను రాజకీయ పార్టీలు మౌనంగా ఉండడం మోడీని సమర్థిస్తున్న వారు అసలు పట్టించుకోకపోవడం గ‌మ‌నార్హం.