పోలవరం విషయంలో కేంద్రం క్లారిటీ !
అయితే పోలవరానికి ఎంత బడ్జెట్ లో కేటాయించారో మాత్రం వెల్లడించలేదు.
By: Tupaki Desk | 31 July 2024 5:11 PM GMTఏపీకి జీవనాడి గా ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం క్లారిటీగా ఉందా అంటే జవాబు అవును అనే వస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని చెబుతూ దానిని పూర్తి చేస్తామని అన్నారు.
అయితే పోలవరానికి ఎంత బడ్జెట్ లో కేటాయించారో మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే తాజా పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ పనులకు సవరించిన అంచనాలుగా 31 వేల 625 కోట్ల రూపాయలు అని చెప్పారు.దీనిని ఆమోదించామని అన్నారు.
అంతే కాదు ఏపీ విభజన చట్టంలోని అనేక హామీలను వివిధ దశల్లో నెరవేరుస్తున్నామని కూడా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే గత పదేళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం ఇచ్చినది పదిహేను వేల కోట్ల రూపాయలు అని ఒక ఒక్క ఉంది. ఇపుడు తొలి దశ అని చెబుతున్నారు. దానికి 31 వేల రూపాయలు సవరించిన అంచనా అంటున్నారు.
ఈ లెక్కన చూస్తే మరో పదహారు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంటుంది. అదే సమయంలో తొలి దశ అని అంటున్నారు. ఈ తొలిదశలో పోలవరం నిర్మాణం ఎంత మేరకు సాగుతుంది. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఏ విధంగా ఇస్తారు అన్నది చూడాలని ఉంది. పోలవరం ప్రాజెక్ట్ లో ఒక లెవెల్ వరకూ నీరు నింపి ఆ పరిధిలోకి వచ్చే గ్రామాలను తరలించి పునరావాసం ఇవ్వడం తొలి దశ అని ప్రచారం లో ఉంది.
ఆ తరువాత ఎత్తుని పెంచి ఆ పరిధిలోకి వచ్చే గ్రామాలకు మలి దశలో పునరావాసం కల్పించి ఆదుకోవడం అన్నది ఉంది. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల సమీక్ష చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని పేర్కొంది. అది డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లకు కూడా పెరగవచ్చు అని కూడా అభిప్రాయపడింది.
ఇటీవలే చంద్రబాబు పోలవరం మొత్తం పూర్తి చేస్తామని దానికి తొలి దశ మలిదశ అని ఎక్కడా ఉండదని స్పష్టం చేశారు. మరి కేంద్ర మంత్రి ప్రకటన చూస్తే తొలి దశ అని ఉంది. ఇప్పటికే పదేళ్ల పుణ్య కాలం గడచిపోయింది. పోలవరం రానున్న అయిదేళ్ళ కాలంలో పూర్తి చేయడమే ఉత్తమం అని అంతా అంటున్నారు. లేకపోతే పోలవరం పూర్తి చేయడం చాలా కష్టం, ఆర్ధికంగా తలకు మించిన భారం అవుతుందని కూడా అంటున్నారు.
అంటే ఏకంగా లక్ష కోట్ల రూపాయలు దాటితే దానిని ఎవరూ పూర్తి చేసేందుకు కూడా సాహసించరని అంటున్నారు. కేంద్రంలో టీడీపీ మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంది పైగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఈ టెర్మ్ లోనో పూర్తి చేసుకోవడం మంచిదని అంటున్నారు. అలాగే పోలవరం ఎత్తు తగ్గించడం పట్ల కూడా చర్చ ఉంది.
అలా తగ్గిస్తే బహుళార్ధక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కూడా అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తికి అలాగే పూర్తిగా నిర్వాసితులకు చెల్లించే నష్టపరిహారం పునరావస ప్యాకేజికి సవరించిన అంచనాలతో కేంద్రం చేత ఆమోదింప చేసుకుని ఒక నిర్దిష్ట కాలపరిమితితో పూర్తి చేస్తేనే ఏపీకి పోలవరం దక్కుతుందని అంటున్నారు.