ఈ మందులు వాడొద్దు.. 156 రకాలపై కేంద్రం నోటిఫికేషన్
వీటిలో ఎక్కువగా సాధారణ ప్రజలు వినియోగించేవి.. ఇంటికి చేరువలో ఉండే మందుల షాపులో దొరికేవే ఉన్నా యి.
By: Tupaki Desk | 24 Aug 2024 5:30 PM GMTసాధారణంగా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే వినియోగించే మందులతో ప్రమాదకర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఇలాంటి 156 రకాల మందులను వినియోగించరాదని పేర్కొంటూ.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో ఎక్కువగా సాధారణ ప్రజలు వినియోగించేవి.. ఇంటికి చేరువలో ఉండే మందుల షాపులో దొరికేవే ఉన్నా యి. వీటిని తరచుగా వినియోగించడం అందరికీ అలవాటే.
అయితే.. ఇవి పైకి జబ్బులను తగ్గిస్తున్నట్టు కనిపిస్తున్నా.. `ఫిక్స్‌డ్ డోస్` కావడంతో వాటి ప్రయోజనం కన్నా.. మరిన్ని రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో మొత్తం గా 156 రకాల ఔషధాలను వినియోగించరాదని పేర్కొంటూ.. ప్రజలను అలెర్ట్ చేసింది. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీటిని తయారు చేసే కంపెనీలపై ఎలాంటి నిషేధం లేదు. ఇది ఎలా ఉంటుందంటే.. పొగాకు ఉత్పత్తులు, మద్యం మాదిరిగానేఉంటుంది.
వాటిని వినియోగిస్తే.. కేన్సర్, లివర్ జబ్బులు వస్తాయని, ఆరోగ్యానికి హానికరమని సిగరెట్ పెట్టెలపైనా.. మద్యం సీసాలపైనా రాస్తారు. కానీ, కంపెనీలను మాత్రం ప్రోత్సహిస్తున్నాయి. ఇలానే ఇవి కూడా.! మొత్తం 156 రకాల్లో ఎక్కువగా ఉన్నవి జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీలకు వాడే మందులే కావడం గమనార్హం. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్ డ్రగ్స్‌ను) కాక్‌టెయిల్ డ్రగ్స్ అని కూడా వ్యవహరిస్తారు.
ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెట్రిజెన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్+ ఫినైలెప్రైన్ హెచ్‌సీఎల్+ పారాసెటమాల్ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు ఉండగా ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను వాడడం ప్రమాదాన్ని ఆహ్వానించడమే అవుతుందని కేంద్రం పేర్కొనడం గమనార్హం.