Begin typing your search above and press return to search.

గూగుల్, ఫేస్‌ బుక్, యూట్యూబ్ కు కేంద్రం సమన్లు... మేటర్ సీరియస్!

మొన్న రష్మికా మందాన, నిన్న కాజోల్ ల పేరుతో కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి.

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:56 AM GMT
గూగుల్, ఫేస్‌  బుక్, యూట్యూబ్  కు కేంద్రం సమన్లు... మేటర్  సీరియస్!
X

డీప్‌ ఫేక్ వీడియో... గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయల్లో ఇదొకటి. సినిమా హీరోయిన్లే ప్రస్తుతం ప్రధాన టార్గెట్ అన్నట్లుగా సాగుతున్న ఈ వీడియోల వ్యవహారం ఆందోళనలు కలిగిస్తోంది. మొన్న రష్మికా మందాన, నిన్న కాజోల్ ల పేరుతో కొన్ని వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. దీనిపై తీవ్రమైన రియాక్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో డీప్ ఫేక్ కూడా ఒకటని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఇద్దరు సినీ తారలకు సంబంధించిన వీడియోలు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... కేంద్ర ప్రభుత్వం గూగుల్, ఫేస్‌ బుక్, యూట్యూబ్‌ తో సహా పలు ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫారం లను పిలిపించి మాట్లాడినట్లు చెబుతున్నారు.

తమ సైట్‌ లలోని డీప్‌ ఫేక్‌ వీడియోలను తొలగించకపోతే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అలాకానిపక్షంలో కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. ఇదే సమయంలో... డీప్‌ ఫేక్‌ లు, తప్పుడు సమాచారం తీవ్రమైన ముప్పుగా ప్రభుత్వం పరిగణిస్తుందని తెలిపారు.

ఈ క్రమంలోనే తమ సైట్‌ లలోని డీప్‌ ఫేక్‌ లను తొలగించని పక్షంలో.. సమాచార సాంకేతిక చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అన్ని ప్లాట్‌ ఫారంలను హెచ్చరించింది. ఈమేరకు సమాచారం అందుకున్న 36 గంటల్లో అన్ని ప్లాట్‌ ఫారంలు తమ సైట్‌ లలో పోస్ట్ చేసిన డీప్‌ ఫేక్‌ లను తొలగించాల్సి ఉంటుందని అన్నారు. అలా చేయకపోతే భారీ జరిమానా విధించబడుతుందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఇదే సమయంలో ఐటి చట్టానికి సవరణలు సైట్‌ ల వద్ద ఉన్న కంటెంట్ తప్పుడు సమాచారం కాదని నిర్ధారించడం అనేది ఆయా సైట్‌ ల బాధ్యత అని రాజీవ్ అన్నారు. పిల్లల లైంగిక వేధింపులు, పేటెంట్ ఉల్లంఘన, తప్పుడు సమాచారంతో సహా ప్లాట్‌ ఫారంలు చూపించలేని 11 సమస్యలు ఉన్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో నవంబర్ 24న గూగుల్, ఫేస్‌ బుక్, యూట్యూబ్ మొదలైన అన్ని వేదికలతో సమావేశం నిర్వహిస్తామని.. ఇందులో డీప్‌ ఫేక్‌ లు, తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్‌ గా పరిగణిస్తుందో చెబుతామని.. భద్రత పరంగా ఇది ఒక పెద్ద సవాల్ అని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇంటర్నెట్ వాడుతున్న ప్రజల పట్ల ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు.