Begin typing your search above and press return to search.

యనమల అల్లుడికి కీలక బాధ్యతలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు ప్రాధాన్యం..

టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణడు అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

By:  Tupaki Desk   |   26 Feb 2025 4:06 PM IST
యనమల అల్లుడికి కీలక బాధ్యతలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు ప్రాధాన్యం..
X

టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణడు అల్లుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనతోపాటు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మరో లోక్ సభ సభ్యుడు డీఎం కతీర్ ఆనంద్ తో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీకి గుంటూరు పొగాకు బోర్డును అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పొగాకు బోర్డు దేశంలో పొగాకు సాగు చేస్తున్న రైతుల సంక్షేమంతోపాటు పొగాకు వాడకం తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సివుంటుంది. అయితే ఈ బోర్డుపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా మంది ఉద్యోగులపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం లక్ష్యం కొడిగడిపోతుందనే భావించిన ప్రభుత్వ పెద్దలు ముగ్గురు ఎంపీలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ఇప్పటివరకు గుంటూరులో ఉన్న పొగాకు బోర్డుకు అఖిల భారత సర్వీసు క్యాడర్ అధికారి ఎండీగా ఉండేవారు. రాజకీయ పలుకుబడి ఉండే వ్యక్తిని చైర్మన్ గా నియమించేవారు. అయితే చైర్మన్ కు ఎలాంటి అధికారం లేకపోవడంతో కేవలం నామమాత్రంగా ఉత్సవ విగ్రహంలా మిగిలిపోయేవాడు. దీంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పలు వివాదాలు, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయేవారు. ఇలా బోర్డు లక్ష్యం నీరుగారిపోయిందనే ఆవేదన వ్యక్తమయ్యేది. ఈ పరిస్థితుల్లో బోర్డును సంస్కరించాలని భావించిన కేంద్ర ప్రభుత్వం పొగాకు బోర్డులో ముగ్గురు ఎంపీలను సభ్యులుగా నియమించింది. పార్లమెంటు సభ్యులకు బోర్డు కార్యకలాపాలలో భాగస్వామ్యం కల్పిస్తే అక్కడ ఏం జరుగుతుందనేది ప్రభుత్వానికి అవగాహన ఉంటుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అందుకే ఎన్డీఏ పార్టీలకు చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలకు బోర్డు సభ్యులుగా నియమించారు.

పొగాకు ఎక్కువగా సాగు అవుతున్న తెలుగు రాష్ట్రాల నుంచే ఇద్దరు సభ్యులను ఏర్పాటు చేయడంతో పొగాకు బోర్డు రూపు రేఖలు మారే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను అదే విధంగా కొనసాగించి అందులో ముగ్గురు పార్లమెంట్ సభ్యులను భాగస్వామ్యం చేయడంతో బోర్డును బలోపేతం చేసినట్లైంది. ఈ చర్యల వల్ల బోర్డు లక్ష్యం దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాణిజ్య పంట అయిన పొగాకును ఉమ్మడి గుంటూరు ప్రకాశం, క్రిష్ణా జిల్లాలతోపాటు తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు. స్థానిక రైతులకు మేలు జరిగేలా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలిస్తోందో వేచిచూడాలి.