Begin typing your search above and press return to search.

వైసీపీ సర్కార్ మీద కేంద్రం యాక్షన్...?

ఏపీలో వైసీపీ అరాచక పాలన మీద యాక్షన్ తీసుకోవాలని గట్టిగా కోరుతున్నామని లోకేష్ అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:40 PM GMT
వైసీపీ సర్కార్ మీద కేంద్రం యాక్షన్...?
X

ఏపీలో వైసీపీ అరాచక పాలన మీద కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని టీడీపీ నేత నారా లోకేష్ గట్టిగా కోరుతున్నారు. కొత్త ఢిల్లీలో ఆయన ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఏ పాపం ఎరుగని తన తండ్రి చంద్రబాబుని 24 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం దారుణం అన్నారు.

ఒక కేసు తరువాత మరో కేసు అన్నట్లుగా మూడు కేసులను రెడీ చేసి పెట్టారని నిందించారు. ఇలా బాబుని బయటకు రానీయకుండా కుట్రకు వైసీపీ తెర లేపిందని లోకేష్ అంటున్నారు. చంద్రబాబు విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని చూసిన మీదటనే కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

ఏపీలో వైసీపీ అరాచక పాలన మీద యాక్షన్ తీసుకోవాలని గట్టిగా కోరుతున్నామని లోకేష్ అంటున్నారు. లోకేష్ ఈ డిమాండ్ మీడియా ముఖంగా ఓపెన్ గా చేయడం ఇదే తొలిసారి. ఆయన కేంద్ర పెద్దలతో లోకేష్ భేటీ అవుతారని ఇప్పటిదాకా వినిపించింది. అయితే అది జరిగినట్లుగా లేదు. అదే సమయంలో అపాయింట్మెంట్ అయితే దక్కలేదని ప్రచారం సాగుతోంది.

మరో వైపు చూస్తే ఈ దశలో కేంద్రం ఏపీ ప్రభుత్వం మీద యాక్షన్ కి దిగుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఏపీలో వైసీపీకి కేంద్రంలోని బీజేపీకి మధ్య తెర చాటు అవగాహన ఉందని కూడా అంటున్నారు. 22 మంది లోక్ సభ ఎంపీలు, 9 మంది రాజ్యసభ ఎంపీలు వైసీపీకి ఉన్నారు. వీరంతా బీజేపీ ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ మద్దతు ఇస్తున్నారు.

బీజేపీ ప్రభుత్వం శీతాకాల సమావేశాలను నవంబర్ డిసెంబర్ లో నిర్వహించనుందని అంటున్నారు. ఈ సందర్భంగా కీలకమైన బిల్లులను సభలో ప్రవేశపెడుతుందని అంటున్నారు. వైసీపీ ఎంపీల మద్దతు బీజేపీకి చాలా ముఖ్యమని అంటున్నారు. ఇక 2024 ఎన్నికల ముందు ఓటాను అకౌంట్ బడ్జెట్ ని కేంద్రం ప్రవేశపెడుతుంది. అయితే అప్పుడు కూడా మరికొన్ని కీలక బిల్లులను ఆమోదించుకుని ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ చూస్తోంది. ఆ విధంగా కనుక ఆలోచిస్తే వచ్చె ఏడాది మార్చి వరకూ బీజేపీకి వైసీపీ అవసరాలు ఉంటాయని అంటున్నారు.

ఇక ఒక వైపు కోణం అయితే ఏపీ రాజకీయాలు చూసుకుంటే బీజేపీకి అన్ని పార్టీలు మద్దతుగా ఉంటున్నాయి. ఏపీలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన అన్నీ మిత్రులుగానే ఉంటున్నాయి. ఇక బీజేపీ కోరి మరీ తాను ఓపెన్ అయి ఒక సైడ్ తీసుకోవడం వల్ల కలిగే లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకుంటుందని అంటున్నారు.

వైసీపీ టీడీపీలు రెండింటితో సమానమైన దూరం దగ్గర పాటిస్తూ ఏపీ రాజకీయాల్లో నెగ్గుకుని రావాలన్నది బీజేపీ వ్యూహం అంటున్నారు. అందువల్ల బీజేపీ నాయకత్వంలోకి కేంద్ర ప్రభుత్వం వైసీపీ మీద ఒవర్ నైట్ యాక్షన్ కి దిగే అవకాశాలు ఉండవనే అంటున్నారు. అయితే ఒక రాజకీయ పార్టీగా కష్టంలో ఉన్న పార్టీగా టీడీపీ కేంద్రం వైపు చూసి ఇలాంటి విజ్ఞప్తులు చేసుకునే హక్కు అవకాశాలు ఉన్నాయి. ఇది టీడీపీ వ్యూహంగా కూడా చూడవచ్చు. రేపటి రోజున బొమ్మ బొరుసు అయిన నాడు బీజేపీ నుంచి వేరుపడాలనుకున్నపుడు దీన్ని కూడా సాకుగా ఆయుధంగా చూపించుకునే వీలు ఉందని అంటున్నారు.