Begin typing your search above and press return to search.

కేంద్ర బడ్జెట్‌.. బీజేపీకి బుద్ధొచ్చిందా?

ఇక మొన్నటి ఎన్నికల్లో బీజేపీపై కన్నెర్ర జేసిన రైతులను మచ్చిక చేసుకోవడానికి బడ్జెట్‌ లో భారీ కేటాయింపులే చేశారు.

By:  Tupaki Desk   |   24 July 2024 8:22 AM GMT
కేంద్ర బడ్జెట్‌.. బీజేపీకి బుద్ధొచ్చిందా?
X

కేంద్ర బడ్జెట్‌ లో కీలక రంగాలకు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం భారీ ఎత్తున కేటాయింపులు చేసింది. ప్రాధాన్య రంగాలకు పెద్దపీట వేసింది. రైతులు, యువత, మధ్యతరగతి వర్గాలు, వేతన జీవులు కన్నెర్ర చేయడంతో ఇటీవలి లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీకి తలబొప్పి కట్టింది. 400 ఎంపీ స్థానాలే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీకి 32 సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. టీడీపీ, జేడీయూ మద్దతు ఇవ్వకపోయి ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు.

ఈ నేపథ్యంలో దేశంలో ప్రధాన వర్గాలైన రైతులు, యువత, మధ్యతరగతి వర్గాల ప్రాధాన్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించింది. త్వరలో మహారాష్ట్ర, బీహార్‌ వంటి కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాము దూరమైన వర్గాలను మళ్లీ దగ్గర చేర్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు తగ్గట్టు తొలి బడ్జెట్‌ లోనే రైతులు, మహిళలు, యువతకు పెద్దపీట వేసింది.

ఇప్పటివరకు రైతులు, యువత సంక్షేమాన్ని బీజేపీ పట్టించుకోలేదనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. కార్పొరేట్, బిజినెస్‌ రంగాలు, వ్యక్తుల సంక్షేమానికే కేంద్ర చట్టాలు, బడ్జెట్‌ కేటాయింపులు, మినహాయింపులు ఉంటున్నాయనే విమర్శలను బీజేపీ మూటగట్టుకుంది.

అయితే సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, యువత, మహిళలు బీజేపీపై పెదవి విరిచారు. ఫలితాలు తాము ఆశించినంత మేర రాకపోవడం, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో తాము దారుణంగా దెబ్బతినడంతో బీజేపీ బడ్జెట్‌ లో తమకు దూరమైన వర్గాలను మచ్చిక చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆయా వర్గాలకు పెద్దపీట వేసిందని విశ్లేషణలు సాగుతున్నాయి.

ముఖ్యంగా దేశంలో ఉన్న 4.1 కోట్ల మంది యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్‌ లో భారీ మొత్తం కేటాయించారు. ఏకంగా రూ.2 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వానికి ఉన్న నవ ప్రాధాన్యాల్లో యువత ఒకటని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. తొలిసారి ఉద్యోగాల్లో చేరినవారిని ఈపీఎఫ్‌వో ఖాతాల ఆధారంగా గుర్తించి రూ.15 వేలను కేంద్రం తొలి వేతనంగా ఇవ్వనుండటం విశేషం. దీనివల్ల 2.10 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. అలాగే దేశంలో 500 టాప్‌ విద్యా సంస్థల్లో కోటి మంది యువతకు ఇంటర్న్‌ షిప్‌ అందించనున్నారు. నెలకు రూ.5 వేలు స్టైపెండ్‌ కూడా అందిస్తారు.

ఇక మొన్నటి ఎన్నికల్లో బీజేపీపై కన్నెర్ర జేసిన రైతులను మచ్చిక చేసుకోవడానికి బడ్జెట్‌ లో భారీ కేటాయింపులే చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టడానికి ప్రోత్సాహం అందించనున్నారు.

అలాగే దేశంలో మొత్తం ఓటర్లలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలపైనా బీజేపీ సంకీర్ణ సర్కార్‌ దృష్టి పెట్టింది. మహిళలు, బాలికల పథకాలకు ఏకంగా రూ.3 లక్షల కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌ తో పోలిస్తే ఏకంగా 2.5 శాతం కేటాయింపులు పెరిగాయి. మహిళలు పనిచేసే చోటే వారికి వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తద్వారా మొన్నటి ఎన్నికల్లో తమకు దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకోవడానికి బీజేపీ సంకీర్ణ సర్కార్‌ తొలి బడ్జెట్‌ లోనే భారీ కేటాయింపులు చేయడం విశేషం.