ఏపీలో సీఈసీకి ఫస్ట్ కంప్లైంట్ వారి నుంచే...!?
చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కూడా ఉన్నారు
By: Tupaki Desk | 9 Jan 2024 2:45 AMకేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో అడుగుపెట్టింది. సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నాయకత్వంలోని కేంద్ర బృందం ఏపీకి చేరుకుంది.
చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కూడా ఉన్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఈనెల 9,10 తేదీలలో రెండు రోజుల పాటు పార్లమెంట్, అసెంబ్లీ-2024 ఎన్నికల సన్నద్ధత పై నిర్వహించే సదస్సులో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమీషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పాల్గొంటారు.
ఇక ఏపీకి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి తొలి ఫిర్యాదు తెలుగుదేశం జనసేనల నుంచే ఉండబోతోంది. ఈ మేరకు ఆ పార్టీలు అపాయింట్మెంట్ తీసుకున్నాయి. ఈ నెల తొమ్మిదిన ఉదయం చంద్రబాబు, పవన్ విజయవాడలో సీఈసీ కమిటీ సభ్యులను కలుస్తారు అని సమాచారం.
రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను చంద్రబాబు, పవన్ ఏపీకే వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.
ఇదిలా ఉంటే ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఓసారి సీఈసీని కలిశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి సీఈసీతో భేటీ కానుండడం ఇదే ప్రథమం. ఇక కేంద్ర ఎన్నికల సంఘం బృందాని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ నెల 9న వస్తున్నారు.
ఆయన వస్తూనే నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్తారు. అక్కడ బాబు ఇంట్లో అల్పాహారం తీసుకున్న తరువత ఇద్దరు నేతలు విజయవాడలోని నోవెటెల్ హొటెల్ కి చేరుకుని సీఈసీ బృందానికి ఫిర్యాదు చేస్తారు. ఇక దీని మీద వైసీపీ తనదైన శైలిలో రియాక్ట్ అయింది.
ఎన్నికల్లో ఓటమికి ఎపుడూ చంద్రబాబు సాకులు వెతుక్కుంటారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత ఈవీఎం ల మీద టీడీపీ ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈసారి ఓటమికి ఎన్నికల్లో దొంగ ఓట్లు కారణం అని ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అని ఆయన ఎత్తిపొడిచారు.
టీడీపీకి గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని, అభ్యర్ధులే ఆ పార్టీకి దొరకడం లేదని కూడా ఆయన విమర్శించారు. అందుకే ఇలా ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని ఆయన నిందించారు. మొత్తానికి చూస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ జనసేన చేయబోయే ఫిర్యాదులు ఏమిటి అన్నది ఆసక్తి అయితే ఉంది.