మణిపూర్ విషయంలో చేతులు కడుక్కున్న కేంద్రం.. ఏం చేసిందంటే!
మణిపూర్‌లో దాదాపు మూడు మాసాలుగా జరుగుతున్న అల్లర్లపై తీవ్ర విమర్శలు వచ్చినా
By: Tupaki Desk | 28 July 2023 4:26 AM GMTమణిపూర్‌లో దాదాపు మూడు మాసాలుగా జరుగుతున్న అల్లర్లపై తీవ్ర విమర్శలు వచ్చినా.. జాతీయ అంతర్జాతీయ మీడియాల్లోనూ విపరీతమైన కథనాలు వెల్లువెత్తినా.. స్పందించని కేంద్రం తాజాగా ఇక్కడ ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ ఘటనపై ఎట్టకేలకు రియాక్ట్ అయింది. దీనికి కూడా కారణం ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ విపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంగా విమర్శలు గుప్పిస్తుండడం.. సభలు పదే పదే వాయిదా పడుతుండడంతో తాజాగా ఈ కేసుపై నిర్ణయం తీసుకుంది.
అయితే.. కేంద్రం తీసుకున్న తాజాగా నిర్ణయంపైనా విమర్శలు వస్తున్నాయి. తక్షణ ఉపశమనం కలిగించేది రాజకీయ ప్రమేయంతోనే నని.. అయితే.. ఈ విషయంలో కేంద్రం తప్పించుకుని.. చేతులు కడుక్కున్నట్టుగా వ్యవహరించిందని పరిశీలకులు.. వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, విపక్షాలు దీనిపై స్పందించడంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా ఈ కేసులను సీబీఐకి అప్పగించారు.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన వ్యవహారంలో కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐని కేంద్రం రంగంలోకి దింపింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. ముఖ్యమైన విచారణను మణిపూర్ వెలుపల నిర్వహించాలని సూచించింది. మణిపూర్‌లో ఇంకా అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణకు అంతరాయం కలగొచ్చన్న ఉద్దేశంతో కేంద్రం ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజా విమర్శలు ఇవే..
+ తాజాగా కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. చట్ట సభల్లో దీనిపై సమాధానం చెప్పడం నుంచి ప్రధాని నరేంద్ర మోడీని తప్పించడం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
+ సీబీఐకి అప్పగించాం కదా..! అని ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకు కూడా ఉపయోగపడుతుం దని అంటున్నారు.
+ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తున్నా.. ఏళ్లు గడుస్తున్నా కీలక కేసులలో పురోగతి లేకుండా పోయిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
+ సీబీఐ కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో బీజేపీ నేతల ప్రస్తావనను సీబీఐ ఏమేరకు విచారిస్తుందనేది ప్రధాన సందేహంగా ఉంది.