జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం... ట్వీట్ చేసిన షా!
మిఛౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Dec 2023 11:07 AM GMTమిఛౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నీట మునిగింది. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం పంట నష్టం వివరాలు నమోదు చేస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఏపీ సర్కార్ రైతులను ఆదుకునే పనులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది. పంట నష్టానికి సంబంధించిన అంచనాలు రూపొందించి, రైతులకు పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించిందని తెలుస్తుంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా తుఫాను వేళ ఆర్ధిక సాయం ప్రకటించింది.
అవును... ఏపీతో పాటు పొరుగునే ఉన్న తమిళనాడులోనూ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భారీవర్షాలకు ప్రధానంగా చెన్నై నగరం మూడు రోజులుగా వరదనీటిలోనే నానుతోంది. ఈ సమయంలో స్టాలిన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ఈ సమయంలో ఏపీతో పాటు తమిళనాడు రాష్ట్రానికి కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ కు రూ. 493.60 కోట్లు, తమిళనాడుకు రూ. 450 కోట్లు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్.డి.ఆర్.ఎఫ్.)కి కేంద్రం రెండవ విడత విరాళాన్ని ముందుగానే విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన అమిత్ షా... మైచాంగ్ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను తీవ్ర ప్రభావితం చేసిందని హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు. ఈ కీలక సమయంలో కేంద్ర ప్రభుత్వం బాధిత రాష్ట్రాలకు అండగా నిలుస్తోందని.. వీలైనంత త్వరగా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బాధిత ప్రజలందరికీ భద్రత, క్షేమం కలగాలని మంత్రి ప్రార్థించారు.
కాగా... మైచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ వల్ల సుమారు 770 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని.. అనేక చెట్లు నేలమట్టం అవ్వగా.. ఎన్నో పశువులు మృత్యువాతపడ్డాయి. నివేధికల ప్రకారం... 194 గ్రామాలు, రెండు పట్టణాలకు చెందిన దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ తుఫాన్ వల్ల ప్రభావితమయ్యారని తెలుస్తుంది!