భారత్ బియ్యం కేజీ రూ.29.. ఎక్కడ? ఎప్పుడు?
బియ్యం ధరలకు కళ్లాలు వేసేందుకు వీలుగా వాటి ఎగుమతులపై నిషేధాన్ని విధించటం తెలిసిందే
By: Tupaki Desk | 3 Feb 2024 5:29 AM GMTఅంతకంతకూ పెరిగిపోతున్న బియ్యం ధరలకు కళ్లాలు వేసేందుకు.. చౌకధరలకు నాణ్యమైన బియ్యాన్ని దేశ ప్రజలకు అందించేందుకు వీలుగా కేంద్రం నడుం బిగించింది. పెరిగిన ధరలకు చెక్ చెప్పేందుకు వీలుగా 'భారత్ బియ్యం' పేరుతో బహిరంగ మార్కెట్ లో బియ్యాన్ని అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు కేజీకి రూ.29గా నిర్ణయించింది. వచ్చే వారం నుంచి అమ్మకాలు షురూ కానున్నట్లుగా కేంద్రంలోని ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఈ కాన్సెప్టులో మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేలా మారుతుందని చెప్పాలి.
బియ్యం ధరలకు కళ్లాలు వేసేందుకు వీలుగా వాటి ఎగుమతులపై నిషేధాన్ని విధించటం తెలిసిందే. అయినప్పటికి బియ్యం ధరలు 15 శాతం మేర పెరగటం గమనార్హం. ఇంతకూ ఈ బియ్యాన్ని ఎక్కడెక్కడ అమ్ముతారు? అన్నది అసలు ప్రశ్న. దీనికి చెబుతున్న సమాధానం ఏమంటే.. నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సింఫుల్ గా చెప్పాలంటే 'నాఫెడ్'), నేషనల్ కో - ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ సీసీఎఫ్), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని అమ్మేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నట్లుగా చెబుతున్నారు.
ఈ మూడు కేంద్రాలతో పాటు ఈ కామర్స్ వేదికగా కూడా ఈ బియ్యాన్ని అమ్ముతామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 5 కేజీలు.. 10 కేజీల బ్యాగుల్లో బియ్యాన్ని అమ్మేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలి దశలో రిటైల్ మార్కెట్ కు 5 లక్షల టన్నుల బియ్యాన్ని అమ్మేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే భారత్ గోధుమపిండి కేజీ రూ.27.50, భారత్ దాల్ కేజీ రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తుందని చెప్పినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇవేమీ అందుబాటులో లేవన్న మాట వినిపిస్తోంది.
బియ్యం ధరలు అదుపులోకి వచ్చే వరకు విదేశాలకు ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు చేస్తున్న ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఎందుకంటే.. ఈ బియ్యం నాణ్యత ఆధారంగానే వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారన్న సంగతి తెలిసిందే. ట్విస్టు ఏమంటే.. దేశంలో బియ్యం తప్పించి మిగిలిన నిత్యవసరాల ధరలు అదుపులో ఉన్నట్లుగా చెబుతున్నా కందిపప్పు.. మినపగుళ్లు.. వేరుశనగుళ్లు.. ఇలా ప్రతి వస్తువ ధరలు అంతకంతకూ పెరగటం గమనార్హం.