Begin typing your search above and press return to search.

బైక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఈ విధానం వేలాది మందికి ఉపాధికి కల్పిస్తోంది. మొన్నటి వరకు బైక్ అన్నది కేవలం తిరగటానికి మాత్రమే అన్నట్లు ఉండేది

By:  Tupaki Desk   |   16 Feb 2024 7:30 AM GMT
బైక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
X

గతానికి భిన్నంగా ప్రజారవాణాకు ప్రత్యామ్నాయంగా.. తక్కువ దూరాలకు మొదలు దూరాలకు సైతం ప్రయాణించేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన బైక్ డ్రైవర్ల విషయంలో కేంద్రం తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ర్యాపిడో.. ఓలా.. ఊబర్ తదితర సంస్థలు బైకులు నడిపే వారు.. తమ బైక్ ల మీద ప్యాసింజర్లను తీసుకొని వారు కోరుకున్న గమ్యస్థానాలకు చేర్చే అవకాశాన్ని ఇవ్వటం.. తక్కువ ఛార్జీలు ఉండటంతో ఈ సేవల్ని కోట్లాది ప్రజలు వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విధానం వేలాది మందికి ఉపాధికి కల్పిస్తోంది. మొన్నటి వరకు బైక్ అన్నది కేవలం తిరగటానికి మాత్రమే అన్నట్లు ఉండేది.

ఇప్పుడు దాన్నో ఉపాధి మార్గంగా మార్చుకోవటం చూస్తున్నాం. అయితే.. కొన్నిరాష్ట్రాల్లో ఈ బైక్ ట్యాక్సీలపై ఆంక్షలు విధిస్తున్నాయి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు. వారు చేసేది వ్యాపారం కనుక.. వారికిచ్చే పర్మిట్లపై ఆంక్షలు ఉన్నాయంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. చట్టబద్ధంగా వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం మోటారు సైకిల్స్ అనేవి కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ కలిగి ఉంటాయని.. ఈ ఒప్పందం అద్దె ప్రాతిపదికన ప్రయాణికులను ఎక్కించుకునే వెసులుబాటును కల్పిస్తోందని వెల్లడించింది. ఇదే విషయాన్ని దేశంలోని రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతాలకు అడ్వైజరీని విడుదల చేసింది. రవాణా సౌకర్యంగా..కాంట్రాక్టు క్యారేజీగా మోటారు సైకిళ్లను నడిపేందుకు కుదరదనే రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వానికి ఈ అడ్వైజరీని జారీ చేసింది.

దీని ప్రకారం..పర్మిట్లను నిరాకరించే అధికారంలో లేదని స్పష్టం చేసింది. 4 చక్రాల కంటే తక్కువ ఉండి.. 25సీసీ+ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాల్ని మోటార్ సైకిల్ అంటారని పేర్కొంటూ.. ''కాంట్రాక్ట్ క్యారేజీ ఒప్పందం అనేది.. నిర్ణీత సమయం లేదంటే నిర్ణీత కిలోమీటర్లకు వాహనాల్ని అద్దెకు ఇచ్చేందుకు వెసులుబాటు కలిగిస్తుంది'' అని స్పష్టం చేసింది. కేంద్రం విడుదల చేసిన తాజా అడ్వైజరీతో కొన్ని రాష్ట్రాలు (ఢిల్లీ.. కర్ణాటక..మహారాష్ట్ర) బైక్ డ్రైవర్లపై విధిస్తున్న ఆంక్షలకు ఎలాంటి చట్టబద్ధత లేదన్న విషయాన్ని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పాలి.