Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర.. కేంద్ర నిఘా వర్గాల వార్నింగ్!

తాజాగా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ‘‘గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు.. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వివరాలు వెల్లడించలేం.

By:  Tupaki Desk   |   20 July 2024 8:15 AM GMT
పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర.. కేంద్ర నిఘా వర్గాల వార్నింగ్!
X

షాకింగ్ సమాచారం ఒకటి బయటకు వచ్చింది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాణాలకు హాని ఉన్నట్లు.. ఆయనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందన్న విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టు కొన్ని మీడియా చానెల్స్ లో కధనాలు వస్తున్నాయి . పవన్ ను అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చెప్పడం ఆయన్ను అభిమానించే వారికి ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా కేంద్ర నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ‘‘గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు.. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వివరాలు వెల్లడించలేం. కానీ జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆ గ్రూపులు ఎవరివి? అన్న దానిపై విశ్లేషణ చేసినప్పుడు పవన్ ను హత్య చేసేందుకు కుట్ర జరగొచ్చన్న అభిప్రాయం కలిగేలా పరిణామాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

దీంతో అలెర్ట్ అయిన కేంద్ర నిఘా విభాగం.. నేరుగా పవన్ కు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ కుట్ర సమాచారాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ ఎందుకు టార్గెట్ అయ్యారు? అన్నది చూస్తే.. ఈ రోజున ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా మారిన చంద్రబాబుతో ఉన్నది జనసేనానినే. ఎన్డీయే కూటమిలోకి తెలుగుదేశం పార్టీని తెచ్చేందుకు ఆయన చాలానే శ్రమించారు. దీంతో.. మోడీ వ్యతిరేక శక్తులు పవన్ ను టార్గెట్ చేసే వీలుంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ హిందూ ధర్మం ఆచరించటమే కాదు.. అందుకు సంబంధించిన వాటిని.. ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటించటం తెలిసిందే. ఇది కూడా కొన్ని వర్గాల వారికి కంటగింపుగా మారిందంటున్నారు. మొత్తంగా పవన్ భద్రత మీద వచ్చిన అలెర్ట్ మెసేజ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని రేపుతోంది.