కీలక నిర్ణయం: దేశంలోని 60 రైల్వే స్టేషన్లలో హోల్డింగ్ జోన్లు!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే 60 రైల్వేస్టేషన్లలో హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది.
By: Tupaki Desk | 18 Feb 2025 8:30 AM GMTకేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే 60 రైల్వేస్టేషన్లలో హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇంతకూ ఈ హోల్డింగ్ జోన్లు ఏంటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో పద్దెనిమిది మంది దుర్మరణం పాలు కావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ కొత్త విధానంలో రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంకు బయట ఈ హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. రైల్వే స్టేషన్ లో మెట్ల మీద ఎవరూ కూర్చోకుండా చర్యలు తీసుకోన్నారు. ఢిల్లీ.. పట్నా.. సూరత్.. బెంగళూరు.. కోయంబత్తూరు తదితర స్టేషన్లలో ఈ హోల్డింగ్ జోన్లను నిర్మిస్తారు. ఈ విధానాన్ని ఇప్పటికే ప్రయాగ్ రాజ్ లో అమలు చేయగా.. అది విజయవంతమైనట్లుగా రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
పండుగలు.. ప్రత్యేకత సందర్భాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఈ కొత్త విధానంలో విపరీతమైన రద్దీ ఉండే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల్ని నేరుగా ప్లాట్ ఫాం మీదకు అనుమతించరు. సదరు ట్రైన్ లో ప్రయాణించాల్సిన వారందరిని.. ఈ ప్రత్యేక జోన్లో వేచి ఉండేలా చేస్తారు. రైలు వచ్చే ముందు మాత్రమే ఫ్లాట్ ఫాం మీదకు అనుమతిస్తారని చెబుతున్నారు. దీని కారణంగా అనవసరమైన ఒత్తిడి.. తొక్కిసలాటకు అవకాశం ఉండదని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాల్ని త్వరలో అమలు చేయనున్నారు.