ధరలపై ఏడుపెందుకు... ప్రపంచాన్ని చూసి నేర్చుకోండి: కేంద్రం ఉచిత సలహా!
దేశవ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయి సగటు ఉద్యోగి.. సాధారణ కుటుంబం నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 6 July 2024 11:30 AM GMTదేశవ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోయి సగటు ఉద్యోగి.. సాధారణ కుటుంబం నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు నిత్యావసరాల ధరలు పెరిగాయి. మరోవైపు.. పెట్రోల్ ధరలు అలానే కొనసాగుతున్నాయి. ఇంకోవైపు కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వీటితోనే ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈలోగా.. రోజుమనుషుల జీవితంలో బాగమైపోయిన సెల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ల టారిఫ్లను అన్ని కంపెనీలూ పెంచేశాయి.
నిన్న మొన్నటి వరకు రోజుకు 1.5 జీబీ డేటాతో 28 రోజుల వరకు పనిచేసే రీచార్జ్ 249 ఉంటే.. ఇది ఏకంగా రూ.50 పెరిగిపోయింది. ఇక, దీంతోపాటు.. వివిధ టారిఫ్‌లను బట్టి ధరలను రూ.50-250 వరకు పెంచేశారు. దీనిలో అన్ని ప్రధాన మొబైల్ సర్వీసు కంపెనీలూ ఒకే బాటలో నడుస్తున్నాయి. అయితే.. ఇలా అసంబద్ధంగా టారిఫ్‌లను పెంచి.. వినియోగదారులపై భారం మోపినా.. కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సహా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఎయిటెల్, జియో.. సహా అన్ని ప్రఖ్యాత కంపెనీలూ టారిఫ్‌లను పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ తూర్పారబట్టింది. మరి ఈ సమయంలో కేంద్రం ఏం చేయాలి? ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుంటామనో.. లేదా.. పెంచిన వాటిని తగ్గించేందుకు చర్యలు చేపడతామనో చెప్పాలి. కానీ, కేంద్రం అలా చెప్పలేదు. ``దేశంలో మొబైల్ టారిఫ్‌లు పెంచామని యాగీ చేస్తున్నవారు ఒకటి నేర్చుకోవాలి. ముందుగా ఇతర దేశాల్లో మొబైల్ టారిఫ్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!`` అని ఉచిత సలహా ఇచ్చింది.
అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ తదితర దేశాల మొబైల్ టారిఫ్ జాబితాలను వివరిస్తూ.. ఆయా దేశాలతో పోల్చుకుంటే.. మనదగ్గరే చాలా తక్కువని.. ఆ విషయం తెలుసుకోకుండా.. ధరలు పెరిగిపోయాయని ఎందుకు ఏడుస్తారని.. ప్రశ్నించింది. అంతేకాదు.. మనదేశంలో సేవలు అందిస్తున్న కంపెనీలు.. చాలా కష్టపడుతున్నాయని.. లాభాలు చూసుకోకుండా సేవలు ఇస్తున్నాయని తెలిపింది. ఎప్పుడో రెండేళ్ల కిందట నిర్ణయించిన ధరలను ఇప్పుడు సవరించారని.. కేంద్రం వివరించడం గమనార్హం.
అంతేకాదు.. ఈ విషయంలో తమ పాత్ర నామమాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. అంటే.. మొత్తానికి పెంచిన టారిఫ్‌లను కట్టాల్సిందేనని.. వినియోగదారుడు భరించాల్సిందేనని కేంద్రం తేల్చేసింది. సో.. పెంచిన ధరలను కడతారో.. ఫోన్ల వినియోగం మానుకుంటారో చూడాలి.