ఏపీలో పెట్టుబడులపై టీడీపీ ప్రశ్న... రికార్డ్ స్థాయిలో అన్నకేంద్రం!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీకి దిమ్మతిరిగినంత పనైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 22 July 2023 9:55 AM GMTపార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీకి దిమ్మతిరిగినంత పనైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం... ఏపీలో అభివృద్ధిపై కేంద్రమంత్రి సవివరంగా వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పెత్తందార్ల దోపిడీ ప్రభుత్వం లేదు కాబట్టి అభివృద్ధి, ప్రగతి కూడా లేవనుకున్నారో.. లేక, వారి అనుకూల మీడియా ఛానళ్లు మాత్రమే చూడటం వల్ల అవన్నీ నిజమనుకున్నారో ఏమో తెలియదు కానీ... తాజాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీ ఏపీ గురించిన ఒక ప్రశ్న వేశారు.
అసలు ఏపీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సాహమో.. లేక కచ్చితంగా బాగుండి ఉండదు అని కేంద్రం ద్వారా చెప్పించాలనే ప్రయత్నమో.. ఫలితంగా ఏపీలో పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాయిద్దామని అనుకున్నారో ఏమో కానీ... ఎదురుదెబ్బకు గురయ్యారు టీడీపీ ఎంపీ!
వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నపుడు రాష్ట్రానికి అసలు మంచి జరగకూడదు.. మనం లేనపుడు రాష్ట్రం మొత్తం మట్టిగొట్టుకుని పోవాలి.. ఉంటే మనం ఉండాలి.. పొతే రాష్ట్రం పోవాలి.. ఇదీ టీడీపీ వాళ్ళ ఆలోచన అని అంటుంటారు వైసీపీ నేతలు. టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతల విమర్శల్లో ఏమీ తప్పులేదన్నట్లుగానే ప్రవర్తిస్తుంటారని అంటుంటారు.
అందుకే ఎప్పుడు ఏ చిన్న లోపం.. ఎక్కడ ఏ చిన్న పొరపాటు దొరికినా దాన్ని పట్టుకుని పెద్దది చేసి.. సొంత పత్రికల్లోనూ - అనుకూల ఛానళ్లలోనూ అచ్చు వేసి.. ప్రసారం చేసి జగన్ తో పాటు రాష్ట్రం పరువు తీసిపారేయాలని తపిస్తుంటారని అంటుంటారు.
ఈ క్రమంలో ఇలాంటి తపనతోనో ఏమో కానీ... రాజ్యసభలో ఒక ప్రయత్నం చేశారు టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల. అయితే... ఆ ప్రశ్నకు కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంతో తెలుగుదేశం వారి ఆశలు సాక్షాత్తూ రాజ్యసభ సాక్షిగా నిరాశగా మారాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... ఆంధ్రప్రదేశ్ లో విదేశీ పెట్టుబడులు ఘోరంగా తగ్గిపోయి ఉంటాయని భావించారో ఏమో కానీ... ఏపీలో 2019 మే నుంచి (జగన్ సర్కార్ ప్రారంభమైనప్పటినుంచీ) విదేశీ పెట్టుబడులు తగ్గాయా? దీనివల్ల ఉద్యోగ అవకాశాలూ తగ్గాయా? అంటూ టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వీలైనంత క్లారిటీగా సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి. అవును... కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా... ఏపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదని ప్రకటించారు.
ఇదే సమయంలో.. పారిశ్రామికవేత్తలు ఎఫ్.డి.ఐ. రూపంలో ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని.. ఉపాధి అవకాశాలు కూడా ఏమాత్రం తగ్గలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా... గత ఆర్ధిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి తెలిపిన వివరాల ప్రకారం... 2019 అక్టోబర్ - 2020 మార్చి మధ్య 200.97 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇదే సమయంలో 2020- 21 ఆర్ధిక సంవత్సరంలో 85.85 మిలియన్ డాలర్లు.. 2021-22 కాలంలో 224.96 మిలియన్ డాలర్లు.. 2022-23 ఏదాదిలో 284.22 మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి.
ఇలా జగన్ సీఎం అయినప్పటినుంచీ ఏటా ఏపీలో పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయని లెక్కలతో కూడిన రాతపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్రమంత్రి. అయితే... కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్థంభించిపోయిన ఫలితంగా... 2020-21 మధ్య మాత్రం పెట్టుబడుల్లో క్షీణత ఉందని క్లారిటీ ఇచ్చారు.
ఆ పాండమిక్ సిట్యువేషన్ అనంతరం ఏపీలో తిరిగి పెట్టుబడుల వరద మొదలైందని.. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రికార్డ్ స్థాయిలో 2022- 23 ఆర్ధిక సంవత్సరంలో 284.22 మిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి దక్షతకు ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పకనే చెప్పినట్లయ్యిందని అంటున్నారు.
మరోపక్క... జగన్ సర్కార్ పై బురదజల్లడమే విపక్షం ప్రధాన బాధ్యతగా భావిస్తున్నారనే కామెంట్లు టీడీపీ నేతల విషయంలో వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రం అధోగతి పాలవ్వాలని.. దాన్ని చూస్తూ పండగ చేసుకోవాలని.. ఫలితంగా రాష్ట్ర ప్రజలకు తామే దిక్కావాలని కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నారని అంటున్నారు.
అయితే ఇలా ఆలోచించే విపక్ష నాయకుల ఆశల మీద సీఎం వైఎస్ జగన్ తరచూ నీళ్లు చల్లుతూనే ఉన్నారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సును సైతం ఇలాగే చిన్నచూపు చూసిన తెలుగుదేశం.. అక్కడి సదస్సును, నిర్వహించే విధానాన్ని, దానికి హాజరైన పారిశ్రామికవేత్తలను చూసి వారం రోజులు కంటిమీద కునుకు లేకుండా ఇబ్బంది పడ్డారనే కామెంట్లూ వినిపించాయి.
అయితే వారి బాదను మరింత రెట్టింపు చేస్తున్నట్లుగా... అంబానీ, అదానీ, బిర్లా, భజంకా, జీఎంఆర్ లాంటి మొదలైన పారిశ్రామిక సంస్థలు ఏపీకి ఎదుగురుకుంటూ వచ్చాయి. ఏపీ సర్కార్ పారిశ్రామికవేత్తల పట్ల, పరిశ్రమల ఏర్పాటు పట్ల చూపుతున్న శ్రద్ధను కొనియాడాయి. దీంతో ఇవన్నీ ప్రసారం చేసే ధైర్యం లేని కొన్ని ఛానళ్లు... టీలు అందలేదు, మంచినీళ్లు సరిపోలేదంటూ బురదజల్లే కార్యక్రమం చేశాయి.
ఎవరు ఎన్ని బురదలు జల్లినా.. ఎవరు ఎన్ని రకాలుగా ఏపీ పరువు తీయాలని భావించినా.. ఆంధ్రాను ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్ధేందుకు జగన్ కృషి చేస్తున్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో దేశంలోనే ఏపీ నంబర్ -1 లో నిలిచింది.
దీంతో... "ఏడ్చే వాళ్ళు ఏడవనీ... నవ్వే వాళ్ళు నవ్వనీ... నా గమనం, నా పయనం ప్రగతిపథం వైపే.." అంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు సాగుతూ ఉందని అంటున్నారు ప్రజలు, పరిశీలకులు. ఏది ఏమైనా... రాజ్యసభ సాక్షిగా టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నవల్ల... వారికి దిమ్మతిరగడం ఏమో కానీ... వారి వల్ల ఏపీ ప్రజలకు అభివృద్ధిపై మరింత స్పష్టత వచ్చింది!