Begin typing your search above and press return to search.

మీడియాలో గ్యాంబ్లింగ్ ప్రకటనలు... కేంద్రం హెచ్చరికలు!

అవును... గ్యాంబ్లింగ్‌, ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ ల వల్ల జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 1:30 AM GMT
మీడియాలో గ్యాంబ్లింగ్  ప్రకటనలు... కేంద్రం హెచ్చరికలు!
X

గ్యాంబ్లింగ్‌, ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ ఈ మధ్యకాలంలో విపర్తీతంగా జోరందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఈ సందడి మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో వీటికి సంబంధించిన ఫిర్యాదులు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... గ్యాంబ్లింగ్‌, ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ ల వల్ల జరిగే మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించే ఫ్లాట్ ఫాంస్ కి సంబంధించిన ప్రకటనలను ప్రచురించడం, ప్రదర్శించడం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.

ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ ల ప్రకటనలు, వాటికి సంబంధించిన ప్రమోషనల్‌ కంటెంట్‌.. ఏ రూపంలోనే ఉన్నా సరే దాన్ని తక్షణమే తొలగించాలని మీడియా సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్‌ మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది.

క్రికెట్‌, ఇతర ప్రధాన క్రీడా టోర్నీల ప్రసారాల సమయంలో గ్యాంబ్లింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ లు తమ వేదికల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఈ ఉత్తర్వులను పాటించని సంస్థలు న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదే సమయంలో... ఇలాంటి వేదికలకు మనీ లాండరింగ్‌ నెట్‌ వర్క్‌ తో సంబంధాలుంటున్నాయని.. ఇది దేశ ఆర్థిక భద్రతకు ప్రమాదకరంగా మారుతుందని చెప్పిన కేంద్రం... ఇలాంటి ప్రకటనల కోసం నల్ల డబ్బును ఉపయోగించే అవాకాశాలు అధికంగా ఉన్నాయని ఈ సందర్భంగా హెచ్చరించింది.

మరికొద్ది రోజుల్లో ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో ఈసారి బెట్టింగ్ మరింత జోరందుకునే పరిస్థితులు ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే ఆన్ లైన్ వేదికగా ఈ మ్యాచ్ లకు సంబంధించిన బెట్టింగ్ ఫ్లాంట్ ఫాంస్ ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయంటూ కథనాలొస్తున్న నేపథ్యంలో కేంద్రం సీరియస్ అయ్యింది.

కాగా... ఇటీవల గుజరాత్‌ లో భారీ బెట్టింగ్‌ మోసం బయటపడిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఓ వ్యక్తి బెట్టింగ్‌ యాప్‌ ను రూపొందించాడు. దీంతో కేవలం 9 రోజుల్లోనే రూ.1400 కోట్లు కొట్టేశాడు. ఆ డబ్బును నిందితుడు హవాలా మార్గంలో తన దేశానికి తరలించాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.