Begin typing your search above and press return to search.

సర్వికల్‌ క్యాన్సర్‌.. ఏపీ, తెలంగాణల్లో కూడా ఎక్కువ మంది బాధితులు!

తాజాగా ప్రముఖ నటి పూనమ్‌ పాండే 32 ఏళ్ల చిన్న వయసులోనే ఈ వ్యాధి బారినపడి మృతి చెందారనే వార్త అందరిలోనూ ఆందోళన నింపింది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 7:21 AM GMT
సర్వికల్‌ క్యాన్సర్‌.. ఏపీ, తెలంగాణల్లో కూడా ఎక్కువ మంది బాధితులు!
X

గర్భాశయ క్యాన్సర్‌ (సర్వికల్‌ క్యాన్సర్‌) ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ప్రముఖ నటి పూనమ్‌ పాండే 32 ఏళ్ల చిన్న వయసులోనే ఈ వ్యాధి బారినపడి మృతి చెందారనే వార్త అందరిలోనూ ఆందోళన నింపింది.

కాగా దేశవ్యాప్తంగా సర్వికల్‌ క్యాన్సర్‌ బాధితులు లక్షల సంఖ్యలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు తాజాగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్‌ సభ లో తెలిపింది.

మనదేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 3,42,333 మంది గర్భాశయ క్యాన్సర్‌ తో బాధపడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ భగేల్‌ లోక్‌ సభలో బాంబుపేల్చారు.

ఎక్కువ మంది గర్భాశయ క్యాన్సర్‌ బాధితులున్న రాష్ట్రాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ 7వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నట్లు సత్యపాల్‌ సింగ్‌ వెల్లడించారు. 2023 నాటి నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రాం రిపోర్ట్‌ ప్రకారం... సర్వికల్‌ క్యాన్సర్‌ బాధితులు ఆంధ్రప్రదేశ్‌లో 17,146 మంది, తెలంగాణలో 11,525 మంది ఉన్నారు.

కాగా దేశంలో అత్యధికంగా సర్వికల్‌ క్యాన్సర్‌ బాధితులు ఉత్తరప్రదేశ్‌ లో ఉన్నారు. ఆ రాష్ట్రంలో 45,682 మంది గర్భాశయ క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ తర్వాత స్థానాల్లో తమిళనాడు (36,014), పశ్చిమ బెంగాల్‌ (25,822), బిహార్‌ (23,164), కర్ణాటక (20,678), మధ్యప్రదేశ్‌ (18,475) తదితర రాష్ట్రాలు ఉన్నట్లు చెప్పారు.

మరోవైపు మనదేశంలో క్యాన్సర్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2022లో దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా బాంబుపేల్చింది. 2022లో క్యాన్సర్‌ కారణంగా 9 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు.

మనదేశంలో పురుషులకు ఎక్కువగా నోటి క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సోకుతున్నాయి. అలాగే మహిళలకు రొమ్ము (బ్రెస్ట్‌) క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌ (సర్వికల్‌ క్యాన్సర్‌) సంభవిస్తున్నట్టు తేలింది. అత్యధిక శాతం మంది మృతుల్లో ఈ రకమైన క్యాన్సర్లే కారణమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ‘ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌’ (ఐఏఆర్‌సీ) అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల క్యాన్సర్‌ కేసులు నమోదుకాగా 97 లక్షల మంది అసువులు బాశారు. మనదేశంలో 75 ఏళ్లలోపు వారిలో 10.6 శాతం మంది క్యాన్సర్‌ వ్యాధి బారినపడే ప్రమాదం ఉన్నట్లు తేలింది. వీరిలో మృతిచెందే ప్రమాదం 7.2 శాతంగా నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల లోపు వారిలో 20 శాతం క్యాన్సర్‌ బారినపడొచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేసింది. అలాగే వీరిలో మరణ ముప్పు 9.6 శాతం మందికి ఉండొచ్చని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురిలో ఒకరు తమ జీవితకాలంలో క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రతి 9 మంది పురుషుల్లో ఒకరు, ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు మరణించే ప్రమాదం ఉందని వెల్లడించింది.

2022లో ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల కొత్త కేసులకు, మరణాలకు ప్రధానంగా 10 రకాల క్యాన్సర్లే కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం 185 దేశాల్లో 36 రకాల క్యాన్సర్ల డేటాను విశ్లేషించి ఈ డేటాను విడుదల చేసింది.