ఆ ఒక్క కారణంగానే పదవి తీసుకున్న.. చాగంటి కీలక వ్యాఖ్యలు
అయితే.. తాజాగా పదవిపై ఆయన స్పందించారు. ఈసారి మాత్రం పదవిని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 11 Nov 2024 7:13 AM GMTఐదేళ్ల తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తోంది. అందులో భాగంగానే పలువురి పేర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంకుతో కూడిన కీలక పదవి లభించింది. ఆయనను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. చాగంటి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
అయితే.. ప్రభుత్వం చాగంటిని సలహాదారుగా నియమించినప్పటికీ ఆయన ఆ పదవిని తీసుకుంటారా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. గతంలోనే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పదవులు ఇస్తే ఆయన తిరస్కరించారు. అలాగే.. 2023లోనూ వైసీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇస్తే వద్దన్నారు. అయితే.. తాజాగా పదవిపై ఆయన స్పందించారు. ఈసారి మాత్రం పదవిని తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల్లో నైతిక విలువలు పెంచేందుకు ముఖ్యమైన బాధ్యతను తనకు అప్పగించినట్లు తెలిపారు. దీనిని స్వాగతిస్తున్నానని చెప్పారు. తాను పదవుల కోసం అంగీకారం తెలపడం లేదని, తన వయసు 65 ఏళ్లని, ఆరోగ్యకరంగా చేయగలిగితే ఈ ఐదారేళ్లే అని పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా విద్యార్థులను కూర్చోబెడితే వారికి నాలుగు మంచిమాటలు చెబుతానని అన్నారు. తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే అంతకన్నా సంతోషం ఏముందని పేర్కొన్నారు. ఈ ఒక్క కారణంతోనే తాను పదవి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
వేలాది మంది విద్యార్థులకు సమాజహితం కోసం నైతిక విలువ పెంపు కోసం.. తల్లిదండ్రులు గర్వించేలా.. సమాజం.. దేశభక్తి నింపేలా ప్రవచనాలు చేసేందుకు తనకు మహత్తర అవకాశాన్ని ఇవ్వడం నిజంగా ఆనందంగా ఉందని చాగంటి పేర్కొన్నారు. అలాగే హిందూ ధర్మం, సనాతన ధర్మంపై తాను చేసిన ప్రవచనాలు ఆత్మ సంతృప్తినిచ్చాయని అన్నారు. ప్రతీ పిల్లవాడిలో ప్రతిభను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. వారిలో నైపుణ్యాన్ని గుర్తించి, అభిరుచిని గుర్తించి.. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే అందరూ గొప్పవాళ్లే అవుతారని అన్నారు. గురువులు చెప్పిన పాఠాలు మనసులో శాశ్వతంగా నిలుస్తాయని, యువత సన్మార్గంలో ఉంటే వారి కుటుంబానికి, దేశానికీ కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని చెప్పారు. మహనీయుల స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని సూచించారు. అన్నింటికంటే ముఖ్యంగా పది మందికి సాయం చేస్తూ.. దేశానికి ఉపయోగపడాలని అన్నారు. ఏదైనా పని మొదలుపెడితే అది వెంటనే సఫలం అవుతుందని చెప్పలేమని, వైఫల్యాలు వచ్చినా కుప్పకూలిపోకూడదన్నారు. ‘ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్’ అని అబ్దుల్ కలాం గొప్పగా చెప్పారని గుర్తుచేశారు. అందుకే పరాజయాన్ని ఒక అనుభవంలా తీసుకోవాలని సూచించారు.