మండలి చైర్మన్ సంగతీ డౌటే.. వైసీపీలో లుకలుకలు..!
కీలకమైన శాసన మండలి చైర్మన్ వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 26 July 2024 9:12 AM GMTకీలకమైన శాసన మండలి చైర్మన్ వ్యవహారం.. రాజకీయంగా దుమారం రేపుతోంది. గతంలో వైసీపీ సర్కారు వచ్చినప్పుడు మండలి చైర్మన్‌గా ఉన్న టీడీపీ నాయకుడు మహమ్మద్ షరీఫ్ అనుసరించి తీరుకు.. ప్రస్తుతం ఉన్న వైసీపీ నాయకుడు.. మండలి చైర్మన్ మోషేన్ రాజు అనుసరిస్తున్న తీరుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని వైసీపీమండలి సభ్యుల్లోనే చర్చ సాగుతోంది. గతంలో షరీఫ్.. వైసీపీని పట్టించుకునే వారు కాదు. పైగా.. అప్పటి మంత్రులు మండలిలో సమాధానం ఇస్తుంటే.. ఆయనే సందేహాలు వెలువరించేవారు.
దీంతో అప్పటి అధికార పక్షంగా ఉన్న వైసీపీకి మండలి చైర్మన్ నుంచే సెగ తగిలింది. ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు ఆమోదం కాకుండా ఉండడానికి, కోర్టుకు వెల్లడానికి కూడా.. చైర్మన్ షరీఫ్ అనుసరించిన వైఖరేనన్నది అందరికీ తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఉన్న మండలి చైర్మన్ మోషేన్ రాజు యూటర్న్ తీసుకుంటున్నారనే గుస గుస వినిపిస్తోంది. మండలిలో మంత్రులు వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్నా.. ఆనాటి లోపాలను ఎత్తి చూపుతూ.. బలమైన విమర్శలు చేస్తూ.. ఆయన మౌనంగా ఉంటున్నారు.
అంతేకాదు.. మండలిలో లేని వారిపై కూడా.. టీడీపీ మంత్రులు విమర్శలు చేస్తున్నా.. ఆయన చూస్తూ కూర్చుంటున్నారు. కనీసం పన్నెత్తు మాట కూడా అనడం లేదు. పైగా.. టీడీపీ సహా.. ఇతర ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీలకు ఇస్తున్న ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని ఒకరిద్దరు వైసీపీ మండలి సభ్యులు జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారని.. తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. సీఎం చంద్రబాబుతో నూ.. స్పీకర్ అయ్యన్నతోనూ.. రాసుకుని పూసుకుని తిరుగుతున్నారన్న వాదన వినిపిస్తుండడం కూడా గమనార్హం.
మొత్తంగా చూస్తే.. మోషేన్ రాజు పార్టీ మారిపోతారని ఎవరూ అనడం లేదు కానీ.. మండలిలో అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చేందుకు సుముఖంగా లేరు. తన పనితాను చేస్తున్నానని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అప్పటి చైర్మన్ ఇలా చేయలేదన్నది వైసీపీ నేతల మాట. ఎలా చూసుకున్నా.. మండలి చైర్మన్ విషయంలో ఇప్పుడిప్పుడే... డౌట్లు వస్తే.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.