Begin typing your search above and press return to search.

చంద్రబాబు బాలయ్య అంతా కలిసి చేశారు...నాటి వెన్నుపోటు పై అన్న గారి మనవడు...!

ఎన్టీయార్ జీవితంలో లక్ష్మీ పార్వతి శనిలా ప్రవేశించిందని, ఆమె మాటను తాత గారు వినేవారని చైతన్య క్రిష్ణ గతాన్ని గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 3:31 AM GMT
చంద్రబాబు బాలయ్య అంతా కలిసి చేశారు...నాటి వెన్నుపోటు పై అన్న గారి మనవడు...!
X

ఎన్టీయార్ ని నాడు వెన్నుపోటు పొడవలేదని, టీడీపీని అంతా కలసి రక్షించుకున్నారని ఎన్టీయార్ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్య క్రిష్ణ ఫ్లాష్ కధను మరోమారు మీడియా ముందు పెట్టారు. ఎన్టీయార్ జీవితంలో లక్ష్మీ పార్వతి శనిలా ప్రవేశించిందని, ఆమె మాటను తాత గారు వినేవారని చైతన్య క్రిష్ణ గతాన్ని గుర్తు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వూలో ఆయన గతంలో టీడీపీలో జరిగిన ఘటనలను పంచుకున్నారు.

తాను పెద్ద మనవడిగా నాటి పరిణామాలకు సాక్ష్యాన్ని అని కూడా అన్నారు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ లక్ష్మీ పార్వతి జోక్యం పెరిగిపోయిందని, అందుకే లక్షలాది మంది కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీని కాపాడుకోవడం జరిగింది అన్నారు.

తండ్రిని ఎదిరించడం బాలక్రిష్ణకు ఇష్టం లేదని కూడా చెప్పారు. అలా చేయాలని ఎవరికి ఉంటుందని కూడా ప్రశ్నించారు. అయితే లక్ష్మీ పార్వతి మితిమీరిన జోక్యాన్ని సహించలేక చంద్రబాబు మామయ్య బాలక్రిష్ణ బాబాయ్, హరి బాబాయ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మామయ్య అంతా కలసి నిర్ణయం తీసుకున్నారు అన్నారు.

నాడు చేసిన దాన్ని వెన్నుపోటు అనకూడదని, ఆ విషయంలో చంద్రబాబు బాలక్రిష్ణ తప్పు ఏమీ లేదని అన్నారు. లక్ష్మీ పార్వతి విషయంలో పార్టీలో నిజమైన కార్యకర్తలు అంతా బాధపడ్డారని వారంతా కలసి వ్యతిరేకించడం వల్లనే అలా జరిగింది అని కూడా చెప్పారు.

చంద్రబాబు మీద ఏమీ అనలేకనే వైసీపీ నేతలు వెన్నుపోటు అని అంటున్నారని చైతన్య క్రిష్ణ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మీద అవినీతి అంటున్నా అవి ఆరోపణలు మాత్రమే అని రుజువు చేయలేకపోయారు అని కూడా ఆయన చెప్పడం విశేషం.

మొత్తానికి చూస్తే తమ కుటుంబం మొత్తం పార్టీని రక్షించుకోవడం తప్ప మరేమీ చేయలేదని అన్నారు. చట్ట ప్రకారం ధర్మం ప్రకారం చూసినా చంద్రబాబు బాలయ్య చేసింది ఏ మాత్రం తప్పు కాదని చైతన్య క్రిష్ణ సమర్ధించారు. లక్ష్మీ పార్వతి వల్లనే అంతా జరిగిందని ఆయన అనడం కూడా గమనార్హం.

ఇక తాత ఆమె మాట వినేవారు అని కూడా మనవడు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఫ్లాష్ బ్యాక్ లో వెన్నుపోటు చంద్రబాబు పొడిచారు అన్నది చరిత్రలో ఉంది. రాజకీయ ప్రత్యర్ధులు కూడా బాబుని అదే అంటూంటారు. కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం వెన్నుపోటు కాదని అనడమూ జరుగుతోంది.

మరి వెన్నుపోటా తిరుగుబాటా ఏది కరెక్ట్ అంటే దాని మీద ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేసుకోవాల్సిందే అంటున్నారు. ఇక టీడీపీ కనీ వినీ ఎరగని విధంగా 1994 ఎన్నికల్లో గెలిచింది. నాడు ఎన్టీయార్ కలసి లక్ష్మీపార్వతి ఒక్కరే ప్రచారం చేశారు. ఆనాడు కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు అన్న మాటలకు కూడా జవాబులు లేవు. ఏది ఏమైనా ఎన్టీయార్ జీవితం ఒక తెరచిన పుస్తకం కానీ వెన్నుపోటు మాత్రం ఎప్పటికీ మిస్టరీ అనే అంటారు అంతా.