చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకో అల్లు అర్జున్: జనసేన నేత వార్నింగ్
జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'పుష్ప 2' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు
By: Tupaki Desk | 4 Dec 2024 9:31 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమా బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 12 వేలకు పైగా స్క్రీన్స్ లో, 6 భారతీయ భాషల్లో భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మరికొన్ని గంటల్లో పడబోతున్న ఈ సినిమా ప్రీమియర్ షోల కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని జనసేన పార్టీ నేతల నుంచి హెచ్చరికలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'పుష్ప 2' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకో అల్లు అర్జున్ అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ''ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చింది. గతంలోనే ఆయనకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. బన్నీ పోకడ జనసైనికులకు మెగా అభిమానులకు చాలా బాధను కలిగించింది. ఎవరో ప్రతిపక్షం వారో, వేరే పార్టీ వాళ్ళో మాట్లాడితే పట్టించుకోము కానీ.. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని టచ్ చేసారు''
''మెగా ఫ్యామిలీ అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే వారిని ప్రత్యేకంగా అభిమానించేవారు ఉన్నారు. ఒక కులంగా కాకుండా.. మెగా ఫ్యామిలీ తమ సేవా కార్యక్రమాలతో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మొన్న ఎలక్షన్స్ లో అలాంటి కుటుంబానికి అల్లు అర్జున్ వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ రాష్ట్రం కోసం దేశం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. మేము కూడా ఇలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలని ఎదురుచూశాం. అలాంటిది అల్లు అర్జున్ దగ్గరుండి కూడా వారిని గుర్తించలేదు. మదమెక్కి, అహంతోటి నీకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్''
''మిస్టర్ అల్లు అర్జున్.. నీకు ఇదే చెప్తున్నాం. నీ సినిమాని ఎదుర్కొంటాం. రేపు 5వ తారీఖున ఈ రాష్ట్రంలో రిలీజ్ అవుతున్న నీ సినిమాని జనసైనికులే కాదు, మెగా అభిమానులే కాదు అందరూ అడ్డుకుంటారు. కనీసం ఒకటి నుంచి మూడు రోజులు నీ సినిమాని ఆడకుండా అడ్డుకుంటాం అని హెచ్చరిస్తున్నాం. అల్లు అర్జున్ నీ మదం తగ్గించుకో. ఇప్పటికైనా సరే క్షమాపణలు చెప్పుకో. సినిమా రిలీజ్ కి ముందు నువ్వు చిరంజీవి కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిన పోసుకుంటే, పవన్ కళ్యాణ్ నాగబాబులకు క్షమాపణలు చెప్పుకుంటే.. అప్పుడు మేం ఆలోచన చేస్తాం. క్షమాపణలు చెప్పి చిరంజీవి కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే కచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సినిమా రిలీజ్ ని అడ్డుకుంటామని హెచ్చరిక చేస్తున్నాం'' అంటూ చలమలశెట్టి రమేశ్ బాబు వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 'పుష్ప 2' పోస్టర్లు చింపేసినట్లు తెలుస్తోంది. గోడలకు అంటించిన వాల్ పోస్టర్స్ ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించినట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలు అల్లు అర్జున్ చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు 'పుష్ప 2' సినిమాకి మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లభిస్తోంది. తాజాగా మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎక్స్ వేదికగా బన్నీకి తన బెస్ట్ విషెస్ అందజేశారు. మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ పెట్టారు.