Begin typing your search above and press return to search.

నాన్న కిరాణంలో పద్దులు చూసి.. అతిపెద్ద బ్యాంకు అధిపతిగా తెలంగాణ వ్యక్తి

ఇకమీదట మాత్రం ఆయన పేరును గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పగ్గాలు చేపట్టబోతున్నారు కాబట్టి..

By:  Tupaki Desk   |   1 July 2024 5:58 AM GMT
నాన్న కిరాణంలో పద్దులు చూసి.. అతిపెద్ద బ్యాంకు అధిపతిగా తెలంగాణ వ్యక్తి
X

ప్రభుత్వ రంగంలోని భారత అతిపెద్ద బ్యాంకుల్లో తెలుగు వారు కీలక పోస్టుల్లో ఉన్నారేమో కానీ.. వాటి అధిపతులు అయినట్లు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అందులోనూ తెలంగాణ వారెవరూ బ్యాంకింగ్ లో ఉన్నత స్థానాల్లో ఉన్నట్లు వెలుగులోకి రాలేదు. ఇకమీదట మాత్రం ఆయన పేరును గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పగ్గాలు చేపట్టబోతున్నారు కాబట్టి..

పాలమూరు పల్లె నుంచి..

ఎస్‌బీఐ చైర్మన్‌ గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) సిఫారసు చేసింది. ఇదే బ్యాంకులో శ్రీనివాసులు ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్‌ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. నాలుగున్నరేళ్ల కిందట.. 2020 జనవరిలో ఎండీగా అయిన శ్రీనివాసులు శెట్టి.. త్వరలో చైర్మన్ అవనున్నారు. వచ్చే ఆగస్టు 28న ప్రస్తుత చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా (63) రిటైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్‌ఎస్‌ఐబీ.. శ్రీసువాసులు శెట్టిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసింది. దీనికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదమే తరువాయి.

ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి నుంచి..

శ్రీనివాసులు శెట్టిది ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెదపోతులపాడు. 1988లో ఎస్ బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)గా చేరారు. అయితే, ఆయన అసలు లక్ష్యం ఐఏఎస్. అనుకోకుండా బ్యాంకర్‌ అయినట్లుగా చెబుతారు. అప్పట్లో అందరూ బ్యాంకు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి తాను రాశానని.. ఐఏఎస్‌ కావాలనే కల సాకారం కాకున్నా, బ్యాంకర్ గా సమాజానికి సేవ చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిసిందని వివరిస్తున్నారు.

ప్రభుత్వ బడిలో చదివి..

శ్రీనివాసులు శెట్టి తండ్రిది కిరాణం వ్యాపారం. చిన్నతనంలో దుకాణంలో ఖాతా లెక్కలు చూసేవారు. ఆ అనుభవం వేసిన పునాదే.. ఎస్ బీఐ వంటి పెద్ద బ్యాంకులో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసిందేమో..? కాగా, శ్రీనివాసులు శెట్టి పెదపోతులపాడులోనే ఏడో తరగతి వరకు చదివారు. ఇంటర్ గద్వాలలో, హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చేశారు. ఎస్ బీఐలో చేరాక గుజరాత్, హైదరాబాద్, ముంబైతో పాటు న్యూయార్క్‌ లోనూ పనిచేశారు. డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఉన్న ఎండీల్లో అందరి కంటే సీనియర్‌ శ్రీనివాసులుశెట్టినే. దీంతోనే చైర్మన్ పదవికి సిఫారసు చేశారు.