తప్పులు వాళ్లవి..శిక్ష నిరుద్యోగులకా?
నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో ఏండ్ల తరబడి రాత్రనక, పగలనక చదువుతుంటారు. ఉద్యోగం వస్తే తమ రాత మారిపోతుందని, తమ బతుకు బాగుంటుందని ఆశ పడుతుంటారు.
By: Tupaki Desk | 23 Feb 2025 5:30 AM GMTనిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో ఏండ్ల తరబడి రాత్రనక, పగలనక చదువుతుంటారు. ఉద్యోగం వస్తే తమ రాత మారిపోతుందని, తమ బతుకు బాగుంటుందని ఆశ పడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా పేద, మధ్య తరగతి వారే ప్రిపేర్ అవుతుంటారు. ఆర్థికంగా లేకున్నా అర్ధాకలితో అప్పులు చేసి మరీ లైబ్రరీలు, యూనివర్సిటీల్లో చదువుతుంటారు. వచ్చే ఏడాది నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వాలు లీక్ లు ఇస్తే ఇప్పటి నుంచే చదువుతుంటారు. తీరా ఆ నోటిఫికేషన్లు లేటు అవుతుంటాయి. యేడాదికో, రెండేండ్లకో నోటిఫికేషన్ వచ్చినా..అందులో ఏదో తిరకాసు..నోటిఫికేషన్ లో ఏదో లోపం ఉంటుంది. దాంతో నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది కనుక..మళ్లీ వారు కోర్టుకు ఎక్కుతారు. పరీక్షను వాయిదా వేయమని కోరుతారు. చదువు చుట్టబండలు అవుతుంది. ప్రిపరేషన్ సరిగ్గా సాగదు. ఉద్యోగం రాదు.
రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నడుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-2 రోస్టర్ పాయింట్ల వివాదంతో నిరుద్యోగులు కోర్టుకు ఎక్కారు. ఇవ్వాళ(ఫిబ్రవరి 23)న మెయిన్స్ పరీక్ష ఉంది. రోస్టర్ ను సరిచేశాకే పరీక్షలు పెట్టాలని రాష్ట్రమంతా నిరుద్యోగులు రోడ్డుకెక్కారు. వారి ఆవేదనను ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అర్థం చేసుకోలేదు. దీంతో పరీక్ష యథావిధిగా నడుస్తోంది. గతంలో తెలంగాణలోనూ గ్రూప్-1లో జీవో 29 రద్దు చేయాలని నిరుద్యోగులు నెలల తరబడి ప్రిపరేషన్ ఆపి మరి కోర్టులకు వెళ్లారు. అశోక్ నగర్ లో రోజూ భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. అయినా ప్రభుత్వం వినలేదు. కోర్టులు కూడా ఈ సమయంలో పరీక్షలను ఆపలేమని చేతులెత్తేశాయి. దీంతో ప్రిపరేషన్ లేకుండానే నిరుద్యోగులు పరీక్షలు రాశారు.
నోటిఫికేషన్లలో తప్పులు చేసేవి ప్రభుత్వాలు లేదా బోర్డులు. ఇందులో నిరుద్యోగులు తప్పేం లేదు. వారి పని చదవడం మాత్రమే. ప్రభుత్వాల ఐదేండ్ల కాలంలో ఒకటో, రెండో నోటిఫికేషన్లు ఇవ్వడం..అందులో ఇష్టారీతిన ఏదో తిరకాసు పెట్టడం అనేది ప్రభుత్వాల తప్పే. ఏ నిరుద్యోగి కూడా తాము బాగా చదివితే ఉద్యోగం వస్తుందని..దీనికి ఏ ఆటంకం ఉండొద్దనే కోరుకుంటాడు. జీవో -29 కానీ, రోస్టర్ పాయింట్ల వివాదం కానీ బోర్డుల తప్పే..అయినా బలి అయ్యింది మాత్రం నిరుద్యోగే.
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేదే పేదలు, మధ్య తరగతి విద్యార్థులు. కాయకష్టం చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని నానా కష్టాలు పడి, అప్పులు చేసి చదివిస్తుంటారు. నిరుద్యోగులు ప్రిపరేషన్ చేయడానికి ఏండ్ల తరబడి కేటాయిస్తుంటారు. ఈ ఏడాదైన జాబ్ కొట్టాలని భావిస్తూ ఏండ్లకు ఏండ్లు దాని మీదే ఉంటారు.చివరకు 30 ఏండ్లు దాటిన ఉద్యోగం సాధించలేక, పెళ్లి చేసుకోలేక..ప్రతిభ ఉన్నా ఫెయిల్యూర్ పర్సన్ గా మిగిలిపోతాడు. ఏ సాఫ్ట్ వేర్ జాబో చూసుకున్న ఫ్రెండ్ వేలల్లో సంపాదిస్తుంటాడు. నిరుద్యోగి మాత్రం ఊరికి వెళ్లలేక, సిటీలో ఉండలేక సతమతమై పోతుంటాడు.
నోటిఫికేషన్లలో తప్పులు ఉన్నాయి. సరిచేసిన తర్వాతే పరీక్ష పెట్టండని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుంటారు. దీనికి ప్రభుత్వాలు స్పందించవు. అలా చేస్తే ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుంది..పరీక్ష పెట్టేస్తాం అంటారు. వీటిపై ఫైట్ చేసేది పేద, మధ్యతరగతి నిరుద్యోగులే. ఎందుకంటే తప్పిదాలతో తమకు ఉద్యోగం రాకుంటే తమ జీవితం నాశనమైపోతుందని ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటారు. వీటికి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ధనవంతుల పిల్లలెవరూ రారు. వారు ఈ ఆందోళనలతో సంబంధం లేకుండా మంచిగా చదువుకుంటారు. వాయిదా పడుతుందనే ఉద్దేశంతో పేద నిరుద్యోగులు చదువును పక్కనపెట్టి మరీ ఆందోనలు చేస్తారు. బోర్డులేమో పరీక్ష పెట్టేస్తాయి. ఇందులో ధనవంతుల పిల్లలు ఎగ్జామ్ చక్కగా రాస్తారు. పేద నిరుద్యోగులు మాత్రం ప్రిపరేషన్ సరిగ్గాలేక పరీక్ష రాయలేరు. దీంతో ఉద్యోగాలు ధనవంతుల పిల్లలకు.. బాధలు పేద నిరుద్యోగులకు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ప్రభుత్వాలు నిరుద్యోగుల పక్షాన ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ అమలు చేయడం, నోటిఫికేషన్లలో తప్పిదాలు లేకుండా, పరీక్షలను సక్రమంగా నిర్వహించి, వేగంగా ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. లేకుంటే పేద నిరుద్యోగులు ఇటు ప్రభుత్వ ఉద్యోగం సాధించకుండా..అటు ప్రైవేటు కొలువులు చేసే నైపుణ్యాలు లేక..పేదవాడిగా మిగిలిపోవాల్సి వస్తుంది.