వాట్ అబౌట్ హండ్రెడ్ : జగన్ కి నిలువెత్తు సవాల్
మొత్తానికి మొత్తం ఏపీలోని 175 సీట్లు గెలవాలీ అని ఆయన టార్గెట్ పెట్టి మరీ చెప్పారు.
By: Tupaki Desk | 12 Sep 2024 7:30 PM GMTవై నాట్ 175. ఇది వైసీపీ స్లోగన్. మొత్తం అన్నీ చేసాం, జనాలకు మేలు చేయడంలో కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసాం, మనం చేసిన మంచి ప్రతీ ఇంట్లో ఉంది. అందుకే వై నాట్ 175 అన్నారు వైసీపీ అధినేత జగన్. మొత్తానికి మొత్తం ఏపీలోని 175 సీట్లు గెలవాలీ అని ఆయన టార్గెట్ పెట్టి మరీ చెప్పారు.
సరే అధినాయకత్వం ఆశలు ఆకాంక్షలు ఎపుడూ హై లెవెల్ లో ఉంటాయి. కానీ ఆకాశానికి నిచ్చెనలు వేసి పాతాళానికి కుంగిపోవడం మాత్రం ఒక్క వైసీపీ విషయంలోనే జరిగింది. ఏకంగా 11 సీట్లు మాత్రమే ఆ పార్టీ దక్కించుకుంది. ఎక్కడ 175, ఎక్కడ 11, ఆ మధ్యలో ఎక్కడ 151 సీట్లు అని కూడా చర్చించుకోవాలి.
మొత్తానికి వైసీపీకి చేదు ఫలితాలను 2024 ఎన్నికలు అందించాయి. ఆ విషయం అలా ఉంచితే ఇపుడు ఒక రాజకీయ పార్టీగా వైసీపీ పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చ సాగుతోంది. వైసీపీ 175 సీట్లు అని చెప్పి మరీ తొడకొట్టింది. అన్ని చోట్లా అభ్యర్ధులను పోటీ పెట్టింది. 2024 ఎన్నికల్లో మొత్తం సీట్లకు పోటీ చేసింది. వైసీపీ మాత్రమే. ఆ మాటకు వస్తే 2014లోనూ అదే జరిగింది.
అయితే ఇపుడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ స్థాయి నేతలు ఉన్నారా. మాజీ ఎమ్మెల్యేలు లేదా గట్టి నాయకులు ఉన్నారా అన్నదే చర్చగా ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న విశ్లేషణలు చూస్తే కనుక వైసీపీకి ఏకంగా వంద నియోజక్వర్గాలలో నాయకత్వ లోపం ఉంది అని అంటున్నారు. అంటే నియోజకవర్గాన్ని నడిపించే నాయకులు లేరు అన్నది ఒక కఠిన వాస్తవంగా ఉంది.
ఇలా ఎందుకు జరిగింది అంటే వైసీపీ చేసిన ప్రయోగాలు అయిదేళ్ల పాటు అధినాయకత్వం పార్టీని పట్టించుకోకపోవడం, అయారాం గయారాం ను నమ్మి పట్టం కట్టడం, సోషల్ ఇంజనీరింగ్ పేరిట బలమైన నేతలను పక్కన పెట్టడం, పార్టీలో లీడర్ కి క్యాడర్ కి మధ్యన భారీ గ్యాప్ ఇలా చెప్పుకుంటూ పోతే సవా లక్ష కారణాలు ఉన్నాయని అంటున్నారు.
వైసీపీ 2024 ఎన్నికలో ఏకంగా వంద నియోజకవర్గాలలో రాజకీయ విన్యాసాలే చేసింది. ఒక విధంగా అవి విఫల ప్రయోగాలు అయ్యాయి. ఒక చోట అయిదేళ్ల పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన వారిని తప్పించి వేరొక చోటకు బదిలీ చేశారు. అలాగే కొత్త వారిని తెచ్చి అక్కడ పోటీకి పెట్టారు. దాంతో రెండింటికీ పార్టీ చెడింది.
సిట్టింగులు అయితే కొందరు పార్టీని వీడిపోయారు. ప్రస్తుతం ఉన్న వారి సైలెంట్ అయ్యారు. మరి కొందరు పక్క చూపులు చూస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన వారు తిరిగి తమ సొంత ప్లేస్ లకు వెళ్ళిపోయారు. దాంతో వంద దాకా నియోజకవర్గాలలో పార్టీ జెండాను పట్టి నడిపించే నాధులు కరవు అయ్యారు.
భారీ ఓటమి వైసీపీకి గట్టి షాక్ గా మారింది. దాని నుంచి తేరుకోవడం అధినాయకత్వానికే కుదరని పని అయింది. దాంతో పార్టీ లీడర్లు అయితే ఇంకా యాక్టివ్ కాలేకపోతున్నారు. మరో వైపు పార్టీ చేసిన ప్రయోగాల పట్ల గుర్రుగా ఉన్న వారు నియోజకవర్గాలలో పార్టీ యాక్టివిటీస్ లో పాలు పంచుకోవడం లేదు
ఎన్నికల ముందు పార్టీ అధికారంలో ఉన్నపుడు తమ వినతులు ఏవీ అధినాయకత్వం పట్టించుకోలేదని ఇపుడు తాము ఎందుకు ముందుకు రావాలి అన్న బాధ అసంతృప్తితో చాలా మంది ఉన్నారు. దాంతో వైసీపీలో బిగ్ నంబర్ గా చాలా చోట్ల నాయకత్వ లోటు కనిపిస్తోంది.
జగన్ అయితే జిల్లాల వారీగానే ప్రస్తుతం అధ్యక్షులను నియమిస్తున్నారు. ఇంకా అసెంబ్లీ ఇంచార్జిల దాకా రాలేదు. వారి విషయంలో అతి పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది అని అంటున్నారు. పార్టీ ఓటమి చెందిన వేళ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అని అంటున్నారు. అయిదేళ్ల పాటు చేతి చమురు వదిలించుకున్నా తీరా ఎన్నికల వేళకు మళ్ళీ ప్రయోగాలు చేసి ఉన్న చోట నుంచి కదిపితే దిక్కెవరు అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు
మరో వైపు చూస్తే 2019లో గెలిచిన వారిలో చాలా మంది రాజకీయంగా కొత్త. జగన్ ఊపుతో వారు అంతా గెలిచేశారు. ఇపుడు అధికారం పోయింది కాబట్టి వారు అంతా గమ్మున ఉన్నారు. వారిని ముందు పెట్టి పార్టీని గట్టి ప్రతిపక్షంగా తీర్చిదిద్దడం కూడా హై కమాండ్ కి ఒక టెస్ట్ లాంటిదే అంటున్నారు. ఇక కొత్త నీరు యువ రక్తం అని ఎన్ని కబుర్లు చెప్పినా కూడా పార్టీ ఇపుడున్న పరిస్థితుల్లో ఎవరూ కొత్తగా వచ్చి జెండా మోసేది ఉండదు అని అంటున్నారు.
మరి అయిదేళ్ల పాటు పార్టీని నడిపించడం ఎలా అన్నదే చూదాల్సి ఉంది. అంతే కాదు వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా పార్టీ యాక్టివిటీ లేకుండా ఉంటే బలమైన టీడీపీ కూటమిని ఎలా ఢీ కొట్టేది అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి వైసీపీ హై కమాండ్ ఏ విధంగా అడుగులు వేస్తుందో.