Begin typing your search above and press return to search.

ఆ దేశం వీసా రూల్స్‌ కఠినం.. భారతీయ విద్యార్థులకు మరో కష్టం!

దీంతో భారతీయ విద్యార్థులు వీసాలు పొందాలంటే ఈ కఠిన నిబంధలను దాటాల్సిందే.

By:  Tupaki Desk   |   24 March 2024 4:30 PM GMT
ఆ దేశం వీసా రూల్స్‌ కఠినం.. భారతీయ విద్యార్థులకు మరో కష్టం!
X

భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వెళ్లే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఇప్పుడు ఈ దేశం స్టడీ వీసాలకు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో భారతీయ విద్యార్థులు వీసాలు పొందాలంటే ఈ కఠిన నిబంధలను దాటాల్సిందే.

ఇప్పటికే భారతీయ విద్యార్థులు తమ చదువుల కోసం వెళ్లే ప్రముఖ దేశాలు కెనడా, యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే)లు కూడా స్టడీ వీసా నిబంధనలను కఠినతరం చేశాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల కోవలోనే ఆస్ట్రేలియా కూడా స్టడీ వీసా రూల్స్‌ ను క్లిష్టతరంగా మార్చింది. దీంతో భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు.

ఆస్ట్రేలియా కొత్త స్టడీ వీసా నిబంధనలు మార్చి 23 నుంచి అమల్లోకి వచ్చాయి. విద్యార్థి వీసాల కోసం ఇప్పటివరకు ఉన్న జెన్యూస్‌ స్టూడెంట్‌ స్థానంలో జెన్యూన్‌ టెంపరరీ ఎంట్రంట్‌ (జేటీఏ)ని ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది.

ఈ మేరకు ఆస్ట్రేలియా గతేడాది డిసెంబర్‌ 11న ప్రకటించిన ఈ నిర్ణయం ఈ ఏడాది మార్చి 23 నుంచి అమల్లోకి వస్తుంది. ఆ తేదీ నుంచి సమర్పించిన వీసా దరఖాస్తులపై కొత్త రూల్స్‌ ప్రభావం చూపుతాయి.

ఆస్ట్రేలియాలో తాత్కాలిక గ్రాడ్యుయేట్‌ వీసా కోసం అర్హత పొందేందుకు ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ 6.0 కంటే 6.5 అవసరం అని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి. విద్యార్థి వీసాకు అర్హత పొందేందుకు గతంలో ఈ స్కోర్‌ 5.5 ఉండేది.

అలాగే తాత్కాలిక గ్రాడ్యుయేట్‌ వీసా కోసం ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ కు ఇప్పటివరకు మూడేళ్ల వ్యాలిడిటీ ఉండగా ఇప్పటి నుంచి దాన్ని ఏడాదికి కుదించారు. అంటే ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ ఏడాది వరకు మాత్రమే పనిచేస్తుంది.

ఇప్పుడు ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేస్తే దరఖాస్తు తేదీకి ముందు ఏడాదిలోపు ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ ఉండాలి. ఇందుకు సంబంధించిన రుజువును కూడా చూపాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఐఈఎల్టీఎస్‌ స్కోర్‌ కు అదనంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్తగా జెన్యూన్‌ స్టూడెంట్‌ టెస్టును కూడా నిర్వహించనుంది. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులతోపాటు ఇతర అంతర్జాతీయ విద్యార్థులు ఈ టెస్టును కూడా రాయాల్సి ఉంటుంది.

అలాగే, స్టూడెంట్‌ వీసా కోరుకునే అంతర్జాతీయ విద్యార్థులకు ఉండాల్సిన ఆర్థిక మొత్తాన్ని కూడా పెంచారు. దరఖాస్తుదారులు ఇప్పుడు మొత్తం 24,505 డాలర్లను తమ ఖాతాలో చూపాల్సి ఉంటుంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో ఆస్ట్రేలియాలో 100,009 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. స్టూడెంట్‌ వీసాలపై 2020లో 33,629 మంది, 2021లో 8,950 మంది, 2019లో 73,808 మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్లారు.