జార్ఖండ్ లో హై డ్రామా..నమ్మకస్తుడైన జేఎఎం మాజీ సీఎంకు బీజేపీ వల
మొదట అధికార పార్టీ కూటమిని చీల్చాలనుకుంది.. ఆ తర్వాత సీఎంను ఓ కేసులో జైలుకు పంపింది.. అయినా ఫలితం లేకపోయింది
By: Tupaki Desk | 18 Aug 2024 11:55 AM GMTమొదట అధికార పార్టీ కూటమిని చీల్చాలనుకుంది.. ఆ తర్వాత సీఎంను ఓ కేసులో జైలుకు పంపింది.. అయినా ఫలితం లేకపోయింది.. ఈలోగా ఎన్నికలు వచ్చేశాయి.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యం పెట్టుకుని.. అందుకు తగ్గట్టు వ్యూహాలు పన్నుతోంది. ఏకంగా మాజీ సీఎం.. అధికార పార్టీ అధిష్ఠానానికి చాలా నమ్మకస్తుడైన నాయకుడికి వల వేసింది.
అనూహ్యంగా మారిన రాజకీయం
బీజేపీకి అందినట్లే అంది చేజారుతున్న జార్ఖండ్ లో జనవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు చెందిన హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీల మద్దతుతో ఏర్పడిన ఆయన ప్రభుత్వాన్ని బీజేపీ ఇరుకున పెట్టాలని చూసింది. అయితే, అదేమీ లేకుండానే పూర్తికాలం కొనసాగింది. ఫిబ్రవరిలో సీఎం సోరెన్ ను జైలుకు పంపినా వారి ఎత్తులు సాగలేదు. ఆ సమయంలో జేఎంఎం అధినాయకత్వానికి చాలా నమ్మకస్తుడైన చంపాయీ సోరెన్ ను సీఎం చేసింది. కాగా, జూలైలో హేమంత్ జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టారు. దీంతో చంపాయీని ఇప్పడు తమవైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. ఆయన ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలతో ఆదివారం ఢిల్లీ వెళ్లారన్న కథనాలు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. కానీ, వ్యక్తిగత పనిమీదనే ఢిల్లీ వచ్చినట్లు చంపాయీ చెబుతున్నారు. కానీ, తన ట్విటర్ ఖాతా నుంచి జేఎంఎం పేరు తొలగించారు. దీంతో బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.
ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ?
చంపాయీతో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. వీరంతా బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. చంపాయీ వ్యవహారం మొత్తానికి బీజేపీ పశ్చిమ బెంగాల్ నాయకుడు సువేందు అధికారి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెరవెనుక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరు చంపాయీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. అప్పుడు (ఫిబ్రవరిలో) చంపాయీని సీఎం చేశారు. జూలైలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తనను సీఎం పదవి నుంచి తప్పించడంతో చంపాయీ నిరాశకు గురైనట్లు, ఆ ఫలితంగానే బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.
జార్ఖండ్ అసెంబ్లీకి జనవరి వరకు గడువుంది. అయితే, మహారాష్ట్ర,ఢిల్లీతో కలిపి డిసెంబరులోగా ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు రాష్ట్రాలు జమ్ము కశ్మీర్, హరియాణాలకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.