Begin typing your search above and press return to search.

షాక్: దొంగ బెయిల్ తో జైలు నుంచి జంప్!

మోసం చేయటం డీఎన్ఏగా మార్చుకున్న ఒక నేరస్తుడి బరితెగింపు తెలంగాణ జైళ్ల శాఖలో సీరియస్ చర్చగా మారింది.

By:  Tupaki Desk   |   1 Dec 2024 7:13 AM GMT
షాక్: దొంగ బెయిల్ తో జైలు నుంచి జంప్!
X

మోసం చేయటం డీఎన్ఏగా మార్చుకున్న ఒక నేరస్తుడి బరితెగింపు తెలంగాణ జైళ్ల శాఖలో సీరియస్ చర్చగా మారింది. అదే సమయంలో జైళ్లను ఇలా కూడా బురిడీ కొట్టొచ్చా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జైల్లో ఉన్న ఒక నిందితుడు..తనకు గతంలో మరో కేసులో వచ్చిన బెయిల్ పేపర్ ను ట్యాంపరింగ్ చేసి.. సరికొత్త బెయిల్ గా బిల్డప్ ఇచ్చి దర్జాగా జైలు నుంచి విడుదలైన వైనం.. నోట మాట రానివ్వని రీతిలో మారింది. అదే సమయంలో జైల్లోని లోపాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన మీర్ సుజాత్ అలీఖాన్ పై పలు కేసులు ఉన్నాయి. చీటింగ్ కేసులో అతను కొద్ది నెలల క్రితం చంచలగూడ జైలుకు వెళ్లాడు. ఆ సందర్భంగా అతనికి అండర్ ట్రయల్ ఖైదీగా 5549 నెంబరును కేటాయించారు. ఈ కేసుకు సంబంధించి అక్టోబరు 17న బెయిల్ మీద బయటకు విడుదలయ్యాడు. కట్ చేస్తే.. నవంబరు 2న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అతనిపై మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీంతో అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు చంచలగూడ జైలుకు తరలించారు. ఈసారి అంతనికి అండర్ ట్రయల్ ఖైదీగా 6687 నెంబరును కేటాయించారు.

అయితే.. చంచలగూడ జైల్లో బెయిల్ మంజూరు చేసే శాఖలో పని చేసే మరో నిందితుడు రాముతో లోగుట్టు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం కొన్నిపనులు మినహా ఖైదీల చేత పని చేయించకూడదు. కానీ.. చంచలగూడ జైల్లో మాత్రం బెయిల్ విభాగంలో దొంగతనం కేసులో అరెస్టు అయిన విచారణ ఖైదీకి బాధ్యతలు అప్పగించటం షాకింగ్ గా మారింది. దీంతో.. రాముతో ఒప్పందం చేసుకునన సుజ్జాత్ తనకు గతంలో ఇచ్చిన బెయిల్ కాపీని.. మార్ఫింగ్ చేసి సరికొత్త బెయిల్ గా పత్రాన్ని సిద్దం చేశాడు. తన వారి చేత చంచలగూడ జైలుకు ఆ పత్రాలు వచ్చేలా చేశాడు.

వాటిని చూసిన విచారణ ఖైదీ.. అంతా బాగుందంటూ స్టాంప్ వేశాడు. అనంతరం ఇలాంటి వాటిని చెక్ చేయాల్సిన సిబ్బంది రోటీన్ చెకింగ్ చేసి.. అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా భావించి.. అతడ్నివిడుదల చేశారు. ఈ పాపం ఎలా బయటకు వచ్చిందన్న విషయంలోకి వెళితే.. సుజ్జాన్ మీద మరో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన విచారణ కోసం కోర్టు నుంచి పిటీ వారెంట్ తీసుకున్నారు. ఎవరైనా నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత పీటీ వారెంట్ ఇష్యూ కాదు.

పీటీ వారెంట్ తో జైలుకు వచ్చిన పోలీసులతో ఉలిక్కిపడ్డ చంచలగూడ జైలు అధికారులు.. దొంగబెయిల్ పత్రాలతో విడుదలైనట్లుగా గుర్తించారు. దీంతో.. ఈ అంశం జైళ్లశాఖలో సంచలనంగా మారింది. ఒక దొంగ.. దొంగ బెయిల్ తో జైలు అధికారులకే మస్కా కొట్టేసిన వైనం ఇప్పుడు షాకిచ్చేలా మారింది. దీంతో.. అతడిపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు వెతుకుతున్నారు.