Begin typing your search above and press return to search.

మహిళా మంత్రి రాజీనామా... వేధింపులే కారణం?

పుదుచ్చేరి మాజీ మంత్రి చంద్రకాసు కుమార్తె అయిన చందిరా ప్రియాంక.. దళిత మహిళా నాయకురాలిగా తాను చేసిన పోరాటంతో పాటు పలు కీలక అంశాలను రాజీనామా లేఖలో ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 12:48 PM GMT
మహిళా మంత్రి రాజీనామా... వేధింపులే కారణం?
X

కాదేదీ కుల అహంకారానికీ, కాదేదీ పురుషహంకార పైత్యానికీ అనర్హం అనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. మనిషి ముందుగా.. తాను మనిషి అన్న విషయం తప్ప మిగిలిన పనికిరాని అన్ని విషయాలకూ ప్రాధాన్యం ఇస్తుంటారనే కామెంట్లూ వినిపిస్తూనే ఉంటాయి. దీనికి పొలం, కాలేజ్, ఆఫీస్, సెక్రటేరియట్, అసెంబ్లీ అనే తారతమ్యాలేవీ లేవన్నట్లుగా కొన్ని సంఘటనలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా ఒక మహిళా మంత్రి ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.


అవును...లింగ పక్షపాతం వేధింపులు, కుల వేధింపులూ ఎక్కువైపోయాయని, ఇక అవి భరించడం తనవల్ల కాదని ప్రకటిస్తూ... పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన రవాణాశాఖ మంత్రి చందిరా ప్రియాంక తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. 41ఏళ్ల పుదుచ్చేరి చరిత్రలో తొలి మహిళా మంత్రిగా ఘనత వహించిన ఆమె... ఈ వేధింపులను తాలలేకపోయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను విడుదల చేశారు.


పుదుచ్చేరి మాజీ మంత్రి చంద్రకాసు కుమార్తె అయిన చందిరా ప్రియాంక.. దళిత మహిళా నాయకురాలిగా తాను చేసిన పోరాటంతో పాటు పలు కీలక అంశాలను రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ఇదే సమయలో నాకు ప్రజల మద్దతు ఉన్నా, అసెంబ్లీలో ప్రబలుతున్న వంచన రాజకీయాలు, వేధింపులను ఎదుర్కోవడం సవాలుగా ఉందనే విషయం తాను గ్రహించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదే సమయలో తాను తరచు కులం, లింగ పక్షపాతం వేధింపులకు గురవుతున్నానట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆధిపత్య శక్తులపై పోరు కొనసాగిస్తూ.. మంత్రిగా కొనసాగడం సాధ్యం కాదని గ్రహించి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో ఈ విషయం స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగానూ హాట్ టాపిక్ గా మారింది.

కాగా.. చందిరా ప్రియాంక మే 2016లో నెడుంగడు నియోజకవర్గం నుండి పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇదే క్రమంలో... 2021 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో, ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌ కు చెందిన ఎ మరిముత్తును ఓడించారు. సుమారు 8,560 ఓట్ల తేడాతో ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో... రంగస్వామి ప్రభుత్వం 2021 జూన్ 27న క్యాబినెట్ విస్తరణ చేపట్టిన సమయంలో ఈమె మంత్రిగా ఎంపికయ్యారు.