చంద్రబాబు సంచలన నిర్ణయం.. స్థానిక సంస్థల్లో ఆ నిబంధన ఎత్తివేత
జనాభా నియంత్రణ కోసమని 90వ దశకంలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా నిబంధనలు తీసుకువచ్చారు.
By: Tupaki Desk | 14 Feb 2025 11:30 AM GMTస్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికపై కీలక నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీకి వీలు కల్పిస్తూ చేసిన చట్టానికి ఆమోద ముద్ర వేసింది. జనాభా నియంత్రణ కోసం పెట్టిన ఆ నిబంధనను ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. తాజాగా దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే వీలు కల్పించినట్లైంది.
జనాభా నియంత్రణ కోసమని 90వ దశకంలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా నిబంధనలు తీసుకువచ్చారు. అప్పటి నుంచి పంచాయతీలు, మున్సిపల్, నగర పాలక సంస్థల్లో ఏ ఎన్నిక జరిగినా ఈ నిబంధన పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే జనాభా నియంత్రణలో ఈ నిబంధన సత్ఫలితాలిచ్చినా, ప్రస్తుతం జనాభా పెరుగుదల అవసరం ఉండటంతో ఆ నిబంధనను పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జనన, మరణ నిష్పత్తిలో తేడా ఎక్కువగా ఉంటోంది. జననాల సంఖ్య తగ్గుతుండటం వల్ల భవిష్యత్తులో దేశం వృద్ధులతో నిండిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. జననాల రేటు పెరిగేందుకు తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ పరిస్థితుల్లో నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో జననాల రేటు తగ్గిన విషయాన్ని గుర్తించారు. భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్లకు సిద్ధంగా ఉండేలా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించాలని భావించారు. ముందుగా స్థానిక సంస్థల ప్రాతినిధ్యానికి అడ్డుగా ఉన్న ఆ నిబంధనను తొలగించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి బిల్లును ఆమోదించారు. అనంతరం న్యాయశాఖకు రిఫర్ చేశారు. దీనిపై ఎలాంటి వివాదాలు రాకుండా, నిర్ణయం తీసుకునే బాధ్యతను న్యాయశాఖకు అప్పగించారు.
బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసిన న్యాయశాఖ ఇద్దరి కంటే ఎక్కువ మది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో అనర్హులన్న నిబంధనను తొలగించింది. ఈ మేరకు న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలో 2026-27లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పోటీకి దూరమైన చాలా మంది ఈ సారి తమ తలరాతను పరీక్షించుకునే అవకాశం దక్కిందని సంబరపడుతున్నారు.