బిల్ గేట్స్ ద్వారా బాబు బిగ్ ప్లాన్.. ఇద్దరి మధ్య 30 ఏళ్ల స్నేహం
అప్పట్లో ప్రపంచ కుభేరుడిగా ఉన్న బిల్ గేట్స్ స్వయంగా హైదరాబాద్ వెళ్లడం, తొలి విజిట్ లోనే తన కంపెనీని ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఇతర ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్ వైపు చూశాయి.
By: Tupaki Desk | 23 Jan 2025 9:41 AM GMTఏపీ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మధ్య బంధానికి 30 ఏళ్లు అవుతోంది. 1995లో చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బిల్ గేట్స్ ను హైదరాబాద్ ఆహ్వానించి ఐటీలో ఆ నగరాన్ని మేటిగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అదే బిల్ గేట్స్ తో 30 ఏళ్ల తర్వాత భేటీ అయిన చంద్రబాబు తన కలల నగరం అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా ప్రతిపాదించారు. దావోస్ లో సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య జరిగిన భేటీ సర్వత్రా ఆకర్షించింది. 30 ఏళ్ల క్రితం నాటి సంఘటనలను మళ్లీ గుర్తుకు తెచ్చింది.
టెక్ దిగ్గజం బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలన్నీ అప్పట్లో క్యూ కట్టాయి. హైదరాబాద్ నగరాన్ని సైబర్ క్యాపిటల్ గా మార్చే క్రమంలో ముందుగా హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు, ఆ తర్వాత అమెరికా వెళ్లి హైదరాబాద్ విజిట్ చేయాల్సిందిగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కోరారు. ఇండియాలోని ఓ రాష్ట్రానికి చెందిన సీఎం నేరుగా వచ్చి తన కంపెనీని హైదరాబాద్ లో పెట్టమని కోరడం అప్పట్లో బిల్ గేట్స్ ను ఆకర్షించింది. అంతవరకు ఎవరూ అలా తనను సంప్రదించకపోవడంతో ముగ్ధుడైన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధానికి వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం చూపిన చొరవ, ఇచ్చిన ఆతిథ్యంతో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీని తెరిచేందుకు ఓకే చెప్పారు.
అప్పట్లో ప్రపంచ కుభేరుడిగా ఉన్న బిల్ గేట్స్ స్వయంగా హైదరాబాద్ వెళ్లడం, తొలి విజిట్ లోనే తన కంపెనీని ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఇతర ఐటీ కంపెనీలు అన్నీ హైదరాబాద్ వైపు చూశాయి. అలా ప్రస్తుతం కొన్ని లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. చంద్రబాబు అప్పట్లో బిల్ గేట్స్ ను కలవకపోతే ఈ రోజు హైదరాబాద్ ఈ స్థితిలో ఉండేదో లేదో గానీ, ప్రస్తుతం ప్రపంచంలో గొప్ప నగరంగా ఆవిర్భవించడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆగమనం కూడా ఓ కారణం.
ఇక వర్తమానంలో ఏపీ రాజధాని ఏఐ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసం టెక్నాలజీ పరంగా అమరావతిని డెవలప్ చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు. రానున్న కాలమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ టెక్నాలజీలదేనని భావిస్తున్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రధాన నగరం విశాఖలో ఏఐ విశ్వ విద్యాలయం నెలకొల్పేలా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఏఐ అంటేనే అమరావతి గుర్తుకు వచ్చేలా ఆ నగరాన్ని ప్రమోట్ చేయాలని ఆలోచనతో అమరావతిలో ఏఐ సెంటర్ ఏర్పాటుకు నడుంబిగించారు. ఇందులో భాగంగానే దావోస్ లో బిల్ గేట్స్ ను ప్రత్యేకంగా కలిశారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత తనను కలిసిన చంద్రబాబు ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించడంపై బిల్ గేట్స్ హ్యాఫీగా ఫీల్ అయ్యారంటున్నారు.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబు ఇప్పటికీ అదే ఆసక్తి చూపిస్తుండటం పట్ల ఆకర్షితుడైన బిల్ గేట్స్ తన సహచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఐటీకి బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు తెచ్చుకున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏఐని తన వాయిస్ గా మార్చుకోవడంతో ఈ రంగంలో ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బిల్ గేట్స్ సానుకూలంగా స్పందిస్తే భవిష్యత్ లో చంద్రబాబు ఊహిస్తున్నట్లు అమరావతి ఏఐ సిటీ ఆఫ్ ఇండియాగా మారనుందని అంటున్నారు.