Begin typing your search above and press return to search.

దావోస్ లో 3వ రోజు చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశాలివే!

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2025 5:18 AM GMT
దావోస్  లో 3వ రోజు చంద్రబాబు అత్యున్నత స్థాయి సమావేశాలివే!
X

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సీఐఐ) నిర్వహించిన సమావేశం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం ఏపీ అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ గురించి, పీ4 (ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) విధానం, ఇళ్లపైనే సౌరవిద్యుత్ ఉత్పత్తి మొదలైన అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని తెలిపారు. ఈ నేపథ్యంలో దావోస్ లో మూడో రోజు ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొనబోతున్నారు చంద్రబాబు.

అవును... పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తనదైన శైలిలో ప్రజెంటేషన్స్ ఇస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మూడోరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా.. పలు ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. అవేమిటనేది ఇప్పుడు చూద్దామ్..!

ఇండస్ట్రీ నాయకులతో ఉన్నతస్థాయి సమావేశాలు!:

ఏపీకి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న బాబు.. మూడోరోజు ప్రపంచ దిగ్గజాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా... యూనీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్గాద్, పెప్సికో, గూగుల్ క్లౌడ్, ఆస్ట్రాజెనెకా కంపెనీలకు చెందిన లీడర్స్ తో భేటీ కానున్నారు.

బిల్ గేట్స్ తో భేటీ!:

ఇదే సమయంలో.. పరోపకారి, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతోనూ ఏపీ సీఎం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య జరిగే చర్చలు ఏపీ ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నాయి.

గ్రీన్ కో తో ఎంఓయూ:

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మూడో రోజు ఏపీ ప్రభుత్వం గ్రీన్ కోతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ను లాంఛనప్రాయంగా చేస్తుంది. సుస్థిర ఇంధన కార్యక్రమాలవైపు దీన్ని ఓ ముఖ్యమైన అడుగుగా భావించొచ్చు!

కీలక రౌండ్ టేబుల్ చర్చలు!:

అదే విధంగా మూడో రోజు పర్యటనలో భాగంగా... చంద్రబాబు పలు రౌడ్ టేబుల్ సమావేశాల్లో చురుకుగా పాల్గుంటారు. సహజ వ్యవసాయం - మనిషి - మిషన్ సహకారం, గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదకశక్తికి సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో బాబు పాల్గొంటారు.

ఏపీలో పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం!:

రెండో రోజు జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సమావేశంలో చెప్పిన "పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం" అంశాన్ని బాబు పునరుద్ఘాటించనున్నారు. ఇందులో భాగంగా... ఏపీలో బలమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారుల - స్నేహపూర్వక విధానాలను వివరిస్తూ.. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని మార్చే ప్రయత్నాలు చేయనున్నారు.

ఈ విధంగా... ప్రధానంగా మూడో రోజు చంద్రబాబు టార్గెట్స్ లో పునరుత్పాదక ఇందనం, సుస్థిర వ్యవసాయం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో పరివర్తనాత్మక కార్యక్రమాలు ఆయన ఫోకస్ ఏరియాలుగా ఉన్నాయి.