అతడి కోసం కాన్వాయ్ ఆపి మనసు దోచుకున్న చంద్రబాబు
అందరూ నాయకులే. కానీ.. కొందరు మాత్రమే అధినాయకులుగా మారతారు. ఎందుకు? అంటే.. వారికి ఉండే గుణాలు సపరేటు అని మాత్రం చెప్పొచ్చు.
By: Tupaki Desk | 18 Feb 2025 7:44 AM GMTఅందరూ నాయకులే. కానీ.. కొందరు మాత్రమే అధినాయకులుగా మారతారు. ఎందుకు? అంటే.. వారికి ఉండే గుణాలు సపరేటు అని మాత్రం చెప్పొచ్చు. తాజాగా ఒక ఉదంతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు గురించి తెలిసిన వారంతా వావ్ అనకుండా ఉండలేరు. అదే సమయంలో తెలుగు తమ్ముళ్లు అయితే మా చంద్రబాబు అంటే మాటలా? అనేస్తున్నారు.
ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. తిరుపతిలో జరిగిన ఐటీసీఎస్స్ 2025 సదస్సులో పాల్గొని తిరిగి వెళుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన తిరుగు ప్రయాణంలో మంగళం దారిలో తెల్లని జుట్టుతో రోడ్డు దగ్గర నిలుచొని ఉన్న ఆ వ్యక్తిని చూసినంతనే కారు ఆపాలని చెప్పారు చంద్రబాబు. దీంతో వేగంగా వెళుతున్న ఆయన కాన్వాయ్ ఆగిపోయింది.
ఆగిన కారు అద్దం కిందకు దించిన చంద్రబాబు.. అక్కడే నిలుచున్న ఆ వ్యక్తిని ఉద్దేశించి.. ‘‘ఏం బాషా.. బాగున్నావా? ఆరోగ్యం బాగుందా?’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. దీంతో.. అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఇక.. బాషా సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. తిరుపతిలోని శేషాచలనగర్ కు చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త అయిన అజీజ్ బాష ఆనందానికి హద్దుల్లేవు.
తనకు నలభై ఏళ్లుగా చంద్రబాబు తెలుసని.. ఆయన్ను చూసేందుకు తాను వచ్చానని.. భద్రతా కారణాలతో తాను రోడ్డు పక్కనే నిలబడిపోయినట్లుగా పేర్కొన్నారు. అయినప్పటికి తనను గుర్తు పట్టి ఆగిన చంద్రబాబు తీరుకు స్పందిస్తూ.. ‘ఈ జన్మకు ఇది చాలు’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా చంద్రబాబు మెమరీ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. వేగంగా వెళుతున్న కారులో.. దూరన ఉన్న పార్టీ సీనియర్ కార్యకర్తను గుర్తించటం.. పేరుతో పిలవటం అంటే మాటలా. ఇదే నేతకు.. అధినేతకు తేడా అన్న మాట కొందరి నోట వినిపిస్తోంది.