Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో అంత ఈజీ కాదు

టీడీపీ అధినేతగా దాదాపు అర్ధ శతాబ్దం రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   19 Nov 2024 7:30 AM GMT
చంద్రబాబుతో అంత ఈజీ కాదు
X

టీడీపీ అధినేతగా దాదాపు అర్ధ శతాబ్దం రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన వ్యూహాలు చాలా పదును తేరి ఉంటాయి. బాబు పని అయిపోయింది అనుకున్న ప్రతీసారీ ఆయన రివ్వున ఎగిరి నింగిని చూపిస్తారు. అలా తేలికగా చూసిన వారే ఆశ్చర్యపోయే విధంగా అద్భుతాలు సృష్టిస్తారు.

చంద్రబాబు మీద ఎన్నో విమర్శలు ఉండవచ్చు. కానీ ఆయనలో అంతకు మించి ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి. ఆయనకు పట్టుదల చాలా ఎక్కువ. ఆయన ఒకసారి ఒక విషయం మీద ఫోకస్ పెడితే అంత తేలికగా వదిలిపెట్టరు.

ఇక బాబుకు లేనిది భేషజం. ఆయన ట్రూ పొలిటీషియన్. ఎప్పటికి ఏది అవసరమో దానిని ఆయన అందుకుని ముందుకు సాగుతారు. దీనిని కొంతమంది అవకాశ వాదం అంటారు. కానీ రాజకీయాలు అంటేనే డైనమిక్ గా ఉంటాయి. నిన్నటిది నేడు ఉండదు, అలాంటపుడు కాలానికి తగిన విధంగా బాబు ముందుకు సాగితే తప్పేంటి అన్న వారూ ఉన్నారు

చంద్రబాబు చూసేది లక్ష్యాన్ని దాని వెనక విజయాన్ని. మిగిలిన విషయాలను ఆయన పట్టించుకోరు. ఇదిలా ఉంటే ఏడున్నర పదుల వయసులో బాబు ఏపీకి నాలుగవ సారి సీఎం గా ఉన్నారు. బాబు మీద ఇపుడు జనాలకు ఉన్న భావన ఏంటి అంటే ఆయన మీద ఎంతో గౌరవం. ఆయన సీనియర్ మోస్ట్ సిటిజన్ గా ఉన్నారు.

ఎన్నో చూశారు. ఎంతో అనుభవం గడించారు. ఆయన జీవితంలో ఎత్తులు చూసిన తరువాత లోతులు చూసిన తరువాత అంతా నేర్చుకున్నాక ఇక ఆయన కోరుకునేది జన సంక్షేమమే కదా అని అందరూ భావిస్తారు. చంద్రబాబు ఇపుడు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల కోసేమే పూర్తిగా వినియోగిస్తారు అని కూడా అంతా నమ్ముతున్నారు

చంద్రబాబు మీద వ్యక్తిగతంగా జనాలకు అయితే ఏ వ్యతిరేకత లేదు, ఆయన ఇమేజ్ కూడా ఎన్నడూ లేనంతగా అగ్ర స్థానంలో ఉంది. బాబు విజన్ అంటే చాలా మంది అడ్మైర్ గా ఫీల్ అవుతారు. ఏపీని గతిని మార్చేది ఆయనే అని విశ్వసిస్తారు. ఇక చూస్తే బాబు టీడీపీని కూడా పటిష్టంగా ఉంచారు.

అదే టైంలో పార్టీ కూడా ఎన్నడూ లేని విధంగా బలంగా ఉంది. పైపెచ్చు కూటమి కట్టారు. జనసేన టీడీపీకి అండగా ఉంది. ఈ క్రమంలో టీడీపీ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ బాలెన్స్ చేసుకుని వెళ్ళాలని చూస్తోంది. గతంలో చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడుతోంది. మరి టీడీపీని ఓడించడం అంటే వైసీపీకి ఉన్న అతి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. టీడీపీ కూటమి పట్ల వ్యతిరేకత వస్తుందని అదే తమను గెలిపిస్తుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తే మాత్రం అంతకంటే పొరపాటు వేరొకటి ఉండదనే అంటున్నారు.

వైసీపీ అధినేత జగన్ చంద్రబాబుని లైట్ తీసుకుంటున్నారా అన్నది కూడా ఈ రోజుకీ చర్చగానే ఉంది. చంద్రబాబుని పట్టించుకోనవసరం లేదు 175 సీట్లూ మనవే అని అధికారంలో ఉన్నపుడు ధీమా పడుతూ వచ్చారు. కానీ అది తప్పు అని ఫలితాలు నిరూపించాయి.

ఇపుడు విపక్షంలో ఉన్నా కూడా బాబుని మళ్ళీ జనాలు ఎన్నుకోరు అన్న భ్రమలలో ఉంటే కనుక వైసీపీ దెబ్బ తింటుంది అని అంటున్నారు. ఒక వైపు ఏపీలో కూటమి దూకుడుగా సాగుతూంటే వైసీపీ అధినాయకత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

సూపర్ సిక్స్ హామీలలో రెండు కూటమి నెరవేర్చింది. మిగిలినవి ఉన్నాయి. వాటిని కూడా నెరవేర్చాలని డిమాండ్ చేయాల్సిన వైసీపీ నిమ్మళంగా ఉండిపోతోంది అని అంటున్నారు. అయిదు నెలల కూటమి పాలన మీద జనంలోకి వెళ్ళి తన అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం కూటమిని వ్యతిరేకంగా ప్రజాభిప్రాయన్ని కూడగట్టాల్సిన అవసరం లేదా అని అంటున్నారు.

జగన్ కి ఇంకా చంద్రబాబు రాజకీయం అర్ధం కాకపోతే మాత్రం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబుతో రాజకీయం అంత ఈజీ కాదు అన్నది విశ్లేషకుల మాట. మరి వైసీపీ పెద్దలలో ధీమా చూస్తూంటే దాని వెనక ధీమా ఏంటన్నది అర్ధం కావడమే లేదు అంటున్నరు