బాబు చేయరుగా తప్పు...వైసీపీలో నివురు గప్పిన నిప్పు !
రాజకీయాల్లో జంపింగ్స్ కామన్. అయితే అవి శృతి మించి రాగాన పడితేనే ఇబ్బంది. అసలుకే ఎసరు వస్తుంది.
By: Tupaki Desk | 6 Dec 2024 3:28 AM GMTరాజకీయాల్లో జంపింగ్స్ కామన్. అయితే అవి శృతి మించి రాగాన పడితేనే ఇబ్బంది. అసలుకే ఎసరు వస్తుంది. అన్ని జంపింగ్స్ ఎత్తునకు చేర్చలేవు, కొన్ని కుప్పి గెంతులుగా కూడా మిగిలిపోవచ్చు. కొన్ని ఉన్నచోటనే చతికిలపడేలా చేయవచ్చు.
ఏపీలో చూస్తే విభజన తరువాత పెద్ద ఎత్తున రాజకీయ పునరేకీకరణ సాగింది. అది 2024 ఎన్నికల దాకా సాగుతూనే ఉంది. దాని ఫలితాలు పర్యవసానాలు కూడా అందరికీ ఎరుక్గే. ఈ పునరేకీకరణ వల్ల శతాధిక వసంతాల వృద్ధ పార్టీ కాంగ్రెస్ ఏపీలో కను మరుగు అయిపోయింది.
కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది వైసీపీలో ఆ తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు. మిగిలిన వారు మాత్రం కాంగ్రెస్ ని నమ్ముకుని అలా ఉన్నారు. ఇక 2019లోనూ జంపింగ్స్ సాగాయి. 2024లోనూ సాగాయి. వీటి కంటే ముందు 2014 తరువాత వైసీపీ నుంచి టీడీపీలోకి ఏకంగా 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు చేరిపోయారు. ఆ విధంగా వైసీపీ వీక్ అవుతుందని అనుకున్నా అది బూమరాంగ్ అయింది.
జనాలలో అది కూడా ఒక అస్త్రంగా వైసీపీకి పనిచేసింది. 2019లో వైసీపీ గెలుపునకు అది కీలకంగా మారింది. ఇపుడు చూస్తే వైసీపీ మళ్లీ ఓటమి పాలు అయింది. ఆ పార్టీలో ఉన్న జనాలు టీడీపీ వైపు సహజంగానే వచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అయితే ఈసారి అనుకున్నంత ఈజీగా పసుపు కండువాలు కప్పుకోవడం జరగడం లేదు అని అంటున్నారు.
టీడీపీలోనే చాలా మంది నాయకులు ఉన్నారు. పైగా కూటమిలో టీడీపీ ఉంది. పొత్తులతో చాలా మంది త్యాగరాజులు అయ్యారు. దాంతో ఉన్న వారికే అవకాశాలు దక్కాల్సిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో పార్టీలోకి కొత్త వారు వస్తామని అంటే చేర్చుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా వర్గ పోరు మరింత హెచ్చుతుందని అంటున్నారు.
అందుకే చాలా మంది వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని చూస్తున్నా అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని అంటున్నారు. ఉత్తరాంధ్రలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మాజీ మంత్రి చాలా నెలలుగా టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నా కుదరడం లేదు అని అంటున్నారు. అలాగే విజయనగరం జిల్లాలోనూ సీనియర్ నేతలు వైసీపీకి చెందిన వారు సైకిలెక్కుదామని చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది అని అంటున్నారు.
ఈ సమస్య ఉత్తరాంధ్రాలోనే కాదు ఏపీవ్యాప్తంగా ఉందని అంటున్నారు. లేటెస్ట్ గా గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఆళ్ళ నాని టీడీపీలోకి వెళ్లాలని చూసినా దానికి కొంత అవరోధం ఎదురైంది అని అంటున్నారు. ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలే అధినాయకత్వం వద్దకు వెళ్ళి చేర్చుకోవద్దని కోరారని అంటున్నారు.
వారూ వీరూ అన్నారని కాదు కానీ టీడీపీ బలంగా ఉంది. ఆ పార్టీకి లీడర్లకు కొదవ లేదు అంతే కాదు ఎక్కడికక్కడ సీనియర్లే ఉన్నారు. పైగా టీడీపీ క్యాడర్ బేస్డ్ పార్టీ. కొత్త నాయకత్వం పుట్టుకుని వస్తూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చిన పార్టీలోకి చేరేందుకు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని తామర తంపరగా చేర్చుకుంటే వర్గ పోరు చెడ్డ పేరు తప్పించి ఏమీ ఉండదని అంటున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ వారిని చేర్చుకుని చేసిన ఆ తప్పుని మళ్లీ చేయరని అంటున్నారు. ఈ పరిణామాలతో వైసీపీలో ఉన్న నేతలు అంతా ఎటూ వెళ్లలేక ఉండలేక నివురు గప్పిన నిప్పు మాదిరిగా ఉంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ జంపింగులకు మంచి రోజులు ఎపుడు వస్తాయో ఏమో.