Begin typing your search above and press return to search.

'ఈ బంధాన్ని' తెంచలేక పోతున్న చంద్ర‌బాబు.. ఏం జ‌రుగుతోంది?

''కూట‌మి పార్టీల‌తో క‌లిసి మెలిసి ఉండండి.. కూట‌మి పార్టీల నాయ‌కుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లం డి వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి.

By:  Tupaki Desk   |   29 Jan 2025 12:30 PM GMT
ఈ బంధాన్ని తెంచలేక పోతున్న చంద్ర‌బాబు.. ఏం జ‌రుగుతోంది?
X

''కూట‌మి పార్టీల‌తో క‌లిసి మెలిసి ఉండండి.. కూట‌మి పార్టీల నాయ‌కుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లండి వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించండి. ఎక్క‌డా ఎవ‌రూ పొర‌పొచ్చాల‌కు అవ‌కాశం లేకుండా కూట‌మి స‌ర్కారుకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోండి'' - ఇదీ టీడీపీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు కూడా సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అధినేత తీరు ఇలా ఉంటే.. త‌మ్ముళ్ల తీరు మ‌రోలా ఉంది. `కూట‌మి పార్టీల నేత‌లు త‌ప్ప‌!` అని వారు చెబుతున్నారు.

కూట‌మి పార్టీలైన బీజేపీ, జ‌న‌సేన నాయకుల‌తో చాలా చాలా త‌క్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రు లు మాత్ర‌మే క‌లివిడిగా ఉంటున్నార‌న్న‌ది నిజం. ఇదేస‌మ‌యంలో లోపాయికారీగా.. కూట‌మికి క‌ర‌డు గ‌ట్టిన ప్ర‌త్య‌ర్థి పార్టీ వైసీపీ నేత‌ల‌తో మాత్రం చాలా చాలా క‌లివిడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది కూడా వాస్త వం. పంప‌కాలు-పందేలు-బేరాలు-వాటాలు.. ఇలా ఏ కోణంలో చూసుకున్నా.. ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా..రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ-టీడీపీ నేత‌ల‌ `ఈ బంధం` నిర్విఘ్నంగా సాగుతోంది.

ఫ‌లితంగా వైసీపీ నాయ‌కుల హ‌వా మునుప‌టి కంటే ఓ పావ‌లా వంతు త‌క్కువైనా వారిదే కొన‌సాగుతోంది. కోడి పందేల బ‌రుల‌ను టీడీపీ-వైసీపీ నాయ‌కులు పంచేసుకున్నారు. ఆ త‌ర్వాత‌.. ర‌హ‌దారుల నిర్మాణం లోనూ వైసీపీ-టీడీపీ కాంట్రాక్ట‌ర్లు.. క‌లిసి చేసుకుంటున్నారు. మ‌ద్యం దుకాణాల సిండికేట్ నుంచి వాటాల దాకా.. త‌మ్ముళ్ల చేయి.. వైసీపీ నేత‌ల చేయి.. క‌లిసిపోయింది. ఇక‌, వైసీపీ నేత‌ల ప్రాజెక్టుల‌కు.. టీడీపీ నాయ‌కులు అనుమ‌తులు మంజూరు చేసేలా స‌ర్కారులో చ‌క్రం తిప్పుతున్నారు. ఇవ‌న్నీ.. ఒట్టి మాట‌లు కాదు.. ప‌క్కా చేత‌లు!!

తాజాగా పులివెందుల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ కు సోద‌రుడ‌య్యే వెంక‌ట రెడ్డికి గ‌నుల లీజు ఇప్పించార‌న్న చ‌ర్చ తెర‌మీదికి రావ‌డంతో.. అస‌లు కూట‌మి పార్టీలతో కంటే కూడా.. వైసీపీ నాయ‌కుల‌తోనే టీడీపీ నేత‌లు బంధాన్ని కొన‌సాగిస్తున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ బంధాన్ని తెగ్గొట్ట‌క‌పోతే.. స‌ర్కారుకే న‌ష్ట‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నా రు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.