సూపర్ సిక్స్.. మోడీ ఫిక్స్ ?
అయితే విశాఖలో జరిగిన మోడీ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావించారు.
By: Tupaki Desk | 9 Jan 2025 7:40 AM GMTసూపర్ సిక్స్ అన్నది ఎన్నికల ముందూ తరువాత కూడా ఒక అతి పెద్ద చర్చగానే ఉంటోంది. సూపర్ సిక్స్ హామీలే టీడీపీ కూటమికి విజయ సోపానాలు అయినాయి. ఆరు నూరు అయినా ఆరు హామీలూ నెరవేరుస్తామని అంటేనే జనాలు టీడీపీ కూటమికి ఓటు వేశారు అన్న విశ్లేషణలోనూ ఎన్నో నిజాలు ఉన్నాయి.
అధికారం చేతిలో పడ్డాక టీడీపీ కూటమి వీటిలో ఎన్ని హామీలు నెరవేర్చింది అన్నది కూడా చర్చకు వస్తున్న విషయమే. సామాజిక పెన్షన్ పెంచారు. ఆ హామీ నెరవేరినట్లే. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు అన్నారు. అది ఈ గత ఏడాది స్టార్ట్ చేశారు. అయింతే ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి.
అయితే వాటికి అదిగో ఇదిగో ముహూర్తం అంటూ చెబుతూ వస్తున్నారు. అయితే విశాఖలో జరిగిన మోడీ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావించారు. గత అయిదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనం అయింది అని ఆయన విమర్శించారు. తాము అధికారంలోని వస్తే అభివృద్ధి సంక్షేమం రెండూ జాగ్రత్తగా చేస్తామని ప్రజలు ఓటేశారు అన్నారు. ఆ విధంగానే తమ పాలన సాగుతోందని అన్నారు.
అభివృద్ధి విషయంలో ఆరేడు నెలల కాలంలోనే ఎన్నో విజయాలను సాధించామని చెబుతూ వచ్చిన చంద్రబాబు హామీలు కూడా నిలబెట్టుకుంటామని అన్నారు. అదే సమయంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే బాధ్యత ఎండీయే దే అని స్పష్టం చేశారు. వేదిక మీద ప్రధాని మోడీ ఉండగానే బాబు ఇంత క్లారిటీగా ఈ విషయం చెప్పారు. దాంతో ఇదే ఇపుడు రాజకీయ చర్చకు కారణం అవుతొంది.
ఏపీలో చూస్తే ఖజనాలో నిధులు లేవు. సూపర్ సిక్స్ హమీలు నెరవేర్చడం అంటే బడ్జెట్ లోకి కొత్తాగా మరో లక్ష కోట్లను అదనంగా భారం మోపడమే అవుతుంది. అసలే అప్పులతో ఉన్న ఏపీకి ఇది అసలు భరించలేని భారమని అంటున్నారు దాంతో ఏమి చేయాలి అంటే హామీలను అలా పక్కన పెట్టాలి. అది రాజకీయంగా ఇబ్బందిని కలిగించే పరిణామం అవుతుంది.
అందుకే కేంద్రం ఇచ్చే సాయం మీదనే ఏపీ ఆశలు పెట్టుకుంది. అప్పులకు ఉదారంగా పచ్చ జెండా ఊపకుండా స్పెషల్ గ్రాంట్స్ కిందనో లేదా ప్రత్యేక నిధుల కిందనో ఏదో విధంగా కేంద్రం ఏపీకి సాయం అందిస్తే అపుడు రాష్ట్రం నెమ్మదిగా ఈ హామీల అమలుకు ముందుకు కదలవచ్చు. మరి ఆ విధంగా చేయాలన్నదే బాబు ఆలోచన అని అంటున్నారు.
అందుకే సభా వేదిక మీద ప్రధాని మోడీ ఉండగానే ఆయన సూపర్ సిక్స్ హామీలు అన్నవి టీడీపీ బాధ్యత కాదు ఎన్డీయేది అని స్పష్టంగా చెప్పారని అంటున్నారు. నిజానికి ఈ హామీల వల్ల ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎంపీల మద్దతుతో కేంద్రంలో మూడవసారి మోడీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశారు.
అంటే ఈ హామీల ఫలాలను బీజేపీ కూడా అందుకున్నది అని తర్కానికి అందేలాగా ఆలోచన చేయవచ్చు. ఇక ఏపీలో ప్రభుత్వాన్ని టీడీపీ ప్రభుత్వం అని అనడం లేదు ప్రధాని సైతం సభా వేదిక మీద ఎన్డీయే ప్రభుత్వం అని చెబుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటున్నారు. మరి ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. హామీలు అయినా అభివృద్ధి కార్యక్రమాలు అయినా కేంద్రం సహకారం అందిస్తేనే తప్పకుండా అమలు అవుతాయి.
మరి ఆ విధంగా చేయాలని బాబు చెప్పకనే చెప్పారని అలా మోడీని ఫిక్స్ చేశారని అంటున్నారు. మరి ఎన్డీయే ఎన్నికల మేనివేస్టోని చేతిలో పట్టుకోకుండా ఫోట దిగకుండా ఆనాడు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి పక్కకు వెళ్లారు.మరి ఇపుడు సూపర్ సిక్స్ హామీల విషయంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సాయం ఇస్తుంది ఏ మేరకు అండగా నిలుస్తుంది అంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు.