ఆదాయం లేదు...బాబు నోట అదే మాట !
ఏపీలో గడచిన ఎనిమిది నెలలుగా ఎంత చేసినా ఇంకా ఆదాయం మాత్రం మెరుగుపడలేదని చంద్రబాబు చెప్పారు.
By: Tupaki Desk | 12 Feb 2025 3:42 AM GMTఏపీలో గడచిన ఎనిమిది నెలలుగా ఎంత చేసినా ఇంకా ఆదాయం మాత్రం మెరుగుపడలేదని చంద్రబాబు చెప్పారు. ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల కంటే కూడా వెనకబడి ఉన్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం సమర్ధంగానే ఉంది. పాలన సాఫీగానే సాగుతోంది. కానీ ఆదాయం మాత్రం తక్కువగా రావడానికి కారణం గత వైసీపీ ప్రభుత్వం చేసిన విద్వంసమే అని చంద్రబాబు చెప్పారు.
ఆ అయిదేళ్ళ కాలం నాటి పరిస్థితులే ఈ రోజుకీ వెంటాదుతునాయని అన్నారు. అందుకే ఎంత చేసినా కూడా ఇంకా ఏపీ ముందుకు సాగడంలేదు ఆర్ధిక పరిపుష్టి అన్నది లేకుండా పోయింది అని అన్నారు. ఆదాయ మార్గాలని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రులు కార్యదర్శుల సదస్సులో బాబు చెప్పారు.
ఇందుకోసం కేంద్రం వైపు చూడాలని అన్నారు కేంద్రం వద్ద రావాల్సిన నిధులు ఏమైనా ఉన్నాయా అన్నది ఒక్కో శాఖ కార్యదర్శి సమగ్రమైన పరిశీలన చేయాలని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి మార్చి 31 చివరి గడువు అని. దాంతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తోంది అని ఆయన చెప్పారు.
వివిధ శాఖల నుంచి ఎంత ఆదాయం వస్తుంది, రాష్ట్రాలకు ఏ ఏ పధకాల కింద కేంద్రం నిధులు కేటాయిస్తోంది అన్నది చూసుకుని మరీ తీసుకుని వచ్చే బాధ్యత కార్యదర్శులు ఉన్నతాధికారులు తీసుకోవాలని బాబు కోరారు. అవసరం అయితే తాను ఇవ్వాల్సిన సహకారం అందిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. అంతే కాదు టీడీపీకి చెందిన ఎంపీల సాయం కూడా ఉంటుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ వంటి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్రాలకు అందులో నుంచి నిధులు ఏ మేరకు వివిధ కార్యక్రమాల కోసం వస్తాయన్నది చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. అదే విధంగా ఇంకా అనేక కేంద్ర పధకాలు ఉన్నాయని వాటిని కూడా పరిశీలించి తగిన విధంగా ఏపీకి నిధులు తేవాలని అన్నారు.
కేవలం మార్చి 31తోనే ఇది అయిపోయింది అని కాకుండా ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో కూడా ఇదే రకమైన కృషి అవసరమని చంద్రబాబు చెప్పారు. ఏపీ ఆర్ధికంగా ఇబ్బందులలో ఉందని దానిని అధిగమించేందుకు అధికారులు పూర్తి సాయం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక ఏప్రిల్ నుంచి అధికారులు గ్రామలకు వెళ్ళాలని అక్కడ ప్రజలతో మమేకం కావాలని ఆ విధంగా వారి సమస్యలను చూడాలని ఫస్ట్ ఇంఫర్మేషన్ గా గ్రౌండ్ లెవెల్ లో జరిగే వాటిని తెలుసుకుని రావాలని బాబు కోరారు. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఆదాయం లేదని చెబుతూనే కేంద్రం నుంచి వచ్చే నిధులను ఒక్క పైసా కూడా వదలకుండా ఒడిసిపట్టాలని అధికారులకు సూచిస్తున్నారు. మరి వచ్చేది ఏపీ బడ్జెట్ దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటుంది అన్నది చూడాల్సిందే అంటున్నారు.